Site icon NTV Telugu

టీడీపీకి అభ్యర్థి కరువు..ఎస్సీ నేతలకు ప్రోత్సాహం కరువు

Nandi Kotukuruy

Nandi Kotukuruy

నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గం. గతంలో జనరల్‌ సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడమే ఆఖరు. ఆ తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2004లో కాంగ్రెస్‌ నుంచి గౌరు చరిత గెలిచారు. 2009కి వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్‌ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీకి రాజీనామా చేశాక సైకిల్‌ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎస్సీ సామాజికవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్‌ అన్నది కేడర్‌ మాట.టీడీపీ జెండా పట్టుకునేవారు కరువు

2009, 2014, 2019 ఎన్నికల్లో ప్రతిసారి కొత్త అభ్యర్థిని టీడీపీ బరిలో దించడం.. ఓడిపోవడం.. ఆ పార్టీ కామనైపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరో టీడీపీ నేతలు కూడా తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి అప్పటి నియోజకవర్గ ఇంచార్జి శివనాథరెడ్డి వ్యాపార కార్యకలాపాలు చూసే బండి జయరాజును అభ్యర్థిగా ప్రకటించారు. మూడు నెలల క్రితం వరకు నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్‌గా శివనాథరెడ్డే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గౌరు వెంకటరెడ్డి పార్టీ ఇంఛార్జ్‌. ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గంలో ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఇంఛార్జ్‌గా నియమించకపోవడంపట్ల టీడీపీ కేడర్‌లో అసంతృప్తి నెలకొందట. టీడీపీ జెండా పట్టుకునే వారే కరువయ్యారు. దీంతో పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు.నాయకులను తీర్చిదిద్దుకోలేకపోతున్నారా?

నందికొట్కూరులో టీడీపీకి బలమైన కేడర్‌ ఉండేది. కానీ.. సరైన నాయకత్వం లేకపోవడంతో కేఆర్‌ ప్రత్యామ్నాయాలు చూసుకుని వెళ్లిపోతోంది. ఈ పరిణామాలు చూశాకైనా.. టీడీపీ అధినాయకత్వం మేలుకుంటుందా? లేక ఎప్పటిలా ప్రేక్షక పాత్రే పోషిస్తుందా అనేది ప్రశ్న. నియోజకవర్గంలో ఒకరిద్దరు విద్యావంతులైన దళిత యువకులు యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ ..వారిని నాయకులుగా తీర్చిదిద్దుకోలేకపోయారని చర్చ సాగుతోంది. గడిచిన 13 ఏళ్లుగా ప్రయోగాలు చేసుకుంటూ పోతోంది పార్టీ. మరి.. 2024 ఎన్నికల నాటికైనా టీడీపీ మేల్కొంటుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. మరి.. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ దఫా ఎలాంటి ఎక్స్‌పెర్‌మెంట్స్‌ చేస్తారో చూడాలి.

 

Exit mobile version