అల్లుడిదేముంది సీజన్ లాంటి వాడు…. వస్తాడు, పోతాడు. కానీ… మనవడు చెట్టులాంటోడు వస్తే పాతుకుపోతాడన్న సినిమా డైలాగ్‌ని అక్కడి రాజకీయ నాయకులు బాగా ఒంటబట్టించుకున్నారా? కాకుంటే… సినిమా డైలాగ్‌లో చెప్పినట్టు వారసుడిని కాకుండా…. వారసురాళ్ళను సిద్ధం చేస్తున్నారా? రాబోయే రోజుల్లో మారబోయే రాజకీయం వాళ్ళని ఊరిస్తోందా? అబ్బాయిల వైపు కాకుండా అమ్మాయిల వైపే అక్కడి నేతలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ వారసురాళ్లు సందడి చేస్తున్నారు. కొందరు ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుంటే.. మరికొందరు సంకేతాలు పంపుతున్నారు. తెలంగాణ మొత్తంలో అత్యధిక మహిళా జనాభా, ఓట్లు ఉన్న ఉమ్మడి జిల్లా నిజామాబాద్. దీంతో… భవిష్యత్తులో ఇక్కడ మహిళల ప్రాతినిథ్యం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నియోజక వర్గాల పునర్విభజన జరిగి, 33శాతం రిజర్వేషన్ సెట్ అయితే… జిల్లా నుంచి ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో…ఓవైపు కొత్త మహిళా నేతలు సిద్ధమవుతుండగా… వివిధ పార్టీల్లో ఇప్పటికే ఉన్న సీనియర్స్ లీడర్స్ కూడా రిజర్వేషన్స్ మారిపోయి ఈసారి తమకు ఛాన్స్ మిస్ అయితే… కుటుంబ సభ్యుల్ని బరిలో దింపే ఆలోచనలో ఉన్నారట. ఆ క్రమంలో ముందు వరుసలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ వారసురాలు తన కూతురు డాక్టర్ పైడి సుచరిత అంటూ చెప్పారాయన.
గత ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయంలో సుచరిత కీలకపాత్ర పోషించారట. ప్రస్తుతం లోకల్‌గా బీజేపీ కార్యక్రమాల్లో అన్నీతానై వ్యవహారిస్తున్నారామె. రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీకి చేసేందుకు రెడీ అంటున్నారట. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ముందు జాగ్రత్తగా.. తన భార్య అయేషా ఫాతిమాను పాలిటిక్స్‌లో యాక్టివ్ చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహారిస్తున్నారామె. బోధన్ సెగ్మెంట్ మహిళకు రిజర్వ్ ఐతే.. ఫాతిమా బరిలో ఉండేలా ప్లానే చేశారట షకీల్. ప్రస్తుతం లోకల్‌గా బీఆర్‌ఎస్ కార్యక్రమాల్ని సమన్వయం చేస్తున్నారామె. ఆయేషా వెల్పేర్ ట్రస్టు పేరిట సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి రాధికా రెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారన్న చర్చ బాల్కొండలో జోరుగా నడుస్తోంది. పండగలప్పుడు ప్లెక్సీలతో హడావుడి చేస్తున్నారామె.
అటు బాన్సువాడ, జుక్కల్ లోను ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. ఐతే రేపు ఒకవేళ బాన్సువాడ మహిళకు రిజర్వ్ ఐతే… తన భార్య సోనీ రెడ్డిని పోటీకి దింపాలన్న ఆలోచనలో భాస్కర్‌రెడ్డి ఉన్నారట. బీజేపీ నుంచి మాజీ ఎంపీ బీబీ పాటిల్ కోడలు రచనా పాటిల్‌ను రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. జుక్కల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు బలంగా ఉన్నా.. రిజర్వేషన్‌లో తేడా వస్తే.. తన భార్య తోట అర్చనతో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇటు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి భార్య మంజులారెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారట. ఇలా చాలా మంది నాయకులు ముందు చూపుతో తమ భార్య, కుమార్తెలను యాక్టివ్ చేస్తున్నారట. అలా అవకాశం లేని వారు కుటుంబంలోని మహిళలకు పొలిటికల్ ట్రైనింగ్ ఇచ్చి రిజర్వేషన్ మారినా సీటు చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు వారుసులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటే.. ఇంకొందరు గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై ఆధారపడి ఈ వ్యవహారాలన్నీ ఉండటంతో అంతా సమయం కోసం ఎదురుచూస్తూ…ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

