నెల్లూరు జిల్లాలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి.
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేయడం అనిల్..కాకాణి వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న సందర్భంగా గోవర్ధన్ రెడ్డి అనుచరులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదే రోజున నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం వివాదాలను మరింత పెంచింది.
ఐతే..దీనిపై అప్పట్లో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఎవరూ విమర్శలు చేసుకోకుండా సభలు నిర్వహించుకోవాలని సర్ది చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కాకాణి…అనిల్ కుమార్ యాదవ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై సర్ది చెప్పారు. కలిసికట్టుగా పని చేయాలని…పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత సూటిపోటి మాటలు..మాటల తూటాలు ఎక్కడా పేలలేదు. ఇక..అంతా సర్దుకుందనుకున్నారు. అయినా నేతల్లో మార్పు రాలేదు. నెల్లూరులో మంత్రి కాకాణి నిర్వహిస్తున్న అధికారిక సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడం లేదు.
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్‌తో కోవూరు ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జత కట్టారు. కాకాణికి మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి ఆయనపై ప్రసన్న కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనిల్ కుమార్..ప్రసన్న కుమార్ రెడ్డిల ఇళ్లకు కాకాణి వెళ్లి సహకరించలని కోరారు. అయినా వాళ్ళు మాత్రం వారి ధోరణిలోనే కొనసాగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కాకాణి నిర్వహిస్తున్న సమావేశాలకు రావడం లేదు. ఆయన అనుచరులు కొందరు అధికారిక పదవుల్లో ఉన్నా వారు కూడా కాకాణికి దూరంగానే ఉంటున్నారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లోనైనా నేతలు కలిసికట్టుగా పని చేస్తారని భావించారు. కానీ..అక్కడా సీన్ రిపీటైంది.. ఏమాత్రం మారలేదు. వై.సి.పి.అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆత్మకూరుకు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి నామినేషన్‌లో పాల్గొనేందుకు అనిల్ కుమార్ యాదవ్..నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు ఆలయం వద్దకు వచ్చారు. ఇదే సమయంలో మంత్రి కాకాణి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారనే సమాచారం అందింది. కాకాణి వస్తే ఆయనతో మాట్లాడాల్సి వస్తుందనో..లేక..మంత్రిగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వాల్సి వస్తుందనో.. ఏమో అభ్యర్థిని హడావుడిగా అభినందించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనకుండా అనిల్..ప్రసన్నకుమార్‌లు నెల్లూరుకు వెళ్లిపోయారు. తెలియడంతో విక్రమ్ రెడ్డిని అభినందించి..నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనకుండా అనిల్..ప్రసన్నకుమార్‌లు అటు నుంచి అటే నెల్లూరుకీ వెళ్లిపోయారు. అనంతరం మంత్రి కాకాణి వచ్చి ర్యాలీ..నామినేషన్‌లో పాల్గొన్నారు.
మరోవైపు…నామినేషన్ కార్యక్రమానికి విక్రమ్ రెడ్డి చిన్నాన్న…ఉదయగిరి ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో చంద్రశేఖర్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. ఆయన నామినేషన్‌కు రాకపోవడంతో ఎన్నికలలో ఏ మాత్రం సహకరిస్తారనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఉన్న విభేదాల వల్లే చంద్రశేఖర్ రెడ్డి రాలేదని భావిస్తున్నారు. కీలక మైన ఎన్నికల తరుణంలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు..విక్రమ్ రెడ్డి మెజారిటీపై ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు.
