National Herald Case
ఊరంతా ఒకదారైతే.. ఉలిపి కట్టుది మరోదారి అన్నట్టుగా ఆ కాంగ్రెస్ నేత వైఖరి ఉందా? దేశమంతా పార్టీ శ్రేణులు రోడ్డెక్కితే.. ఆయన సంబరాల్లో మునిగి తేలారా? విషయం తెలిసి పార్టీలో రచ్చ అవుతోందా? మరుసటి రోజు రోడ్డెక్కారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ఏం చేశారు?
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ప్రశ్నించడంతో.. రోజంతా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి పార్టీ శ్రేణులు. తెలంగాణలోనూ ఆ వేడి కనిపించింది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్నారు పార్టీ నేతలు. వరద బాధిత జిల్లాలో నాయకులకు మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని జిల్లా అధ్యక్షులు నిరసనల్లో కలిసి రావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాంగ్రెస్ నాయకులంతా ఈ మూడ్‌లో ఉంటే.. వరంగల్ DCC అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మరొకటి చేశారు. పార్టీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. ఇలా సంబరాల్లో మునిగి తేలారు. ఇదే కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది.
ఇవి రాజేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియాగాంధీకి సంఘీభావంగా ఉద్యమిస్తుంటే.. అయ్యవారు.. జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉండి చేసిన నిర్వాకం ఇదా అని విస్మయం చెందుతున్నాయట కాంగ్రెస్ శ్రేణులు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి చూస్తున్నారు రాజేందర్‌రెడ్డి. నిరసనలు తనకు సంబంధం లేదన్నట్టుగా వెస్ట్ నియోజకవర్గంలో అనుచరులతో కలిసి వేడుకలు చేసుకోవడం చర్చగా మారింది. కేకులు.. కటింగ్‌లు… అనుచరులతో ఊరేగింపులు.. సర్వమత ప్రార్థనలు రోజంతా సందడే సందడి అన్నట్టుగా మునిగి తేలారట రాజేందర్‌రెడ్డి. పుట్టినరోజు వేడుకల్ని ఎవరూ తప్పుపట్టకపోయినా.. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోనియాగాంధీ విషయంలో పోరుబాట పడితే.. వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే పార్టీలో ప్రశ్నగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో ఏదో చిన్నస్థాయి నాయకుడు ఇలా చేశారంటే పెద్దగా పట్టించుకునేవారే కాదు. కానీ.. జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ.. కేడర్‌ను వెనకేసుకుని చేసిన యవ్వారాలే పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయట. కాంగ్రెస్ చీఫ్ విషయంలో సీరియస్‌గా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. రాజేందర్‌రెడ్డి సంబరాల దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ తెలిసిపోయింది. మనం చేస్తున్నదేంటి.. ఇదే సమయంలో రాజన్న చేసింది ఏంటి అని కామెంట్స్ సంధిస్తున్నారట. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా వ్యక్తిగత వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడంపై పీసీసీ పెద్దలకు కొందరు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో కంప్లయింట్లకు కొదవ ఉండదు. అలాంటిది.. రాజేందర్‌రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కడంతో వెంటనే ఫిర్యాదులు వెళ్లిపోయాట. ఈ అంశంపై పీసీసీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే రాజేందర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో ఎంత వరకు వెళ్తుంది? పిలిచి వివరణ అడుగుతారా? చర్యలు ఉంటాయా? మందలించి పంపుతారా? గాంధీభవన్ వర్గాల్లో చర్చగా మారిన ప్రశ్నలివి. మరి.. పీసీసీ ఏం చేస్తుందో చూడాలి.
