ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ రచ్చకెక్కిందా? కీలక నాయకులంతా ఫోకస్ పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయా? హైకమాండ్ చెంతకు మరో ఫిర్యాదు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ గొడవేంటి?
గొడవలు వస్తే సర్దిచెప్పే నేతలే పేచీలు?
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అందరూ కీలక నాయకులే. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలుకుని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి.. ఇలా అందరూ సీనియర్లే. కానీ తుంగతుర్తి నియోజకవర్గం పంచాయితీని సెటిల్ చేయలేక పోతున్నారు. ఇప్పుడా సమస్యపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. గొడవలు వస్తే సర్దిచెప్పే నేతలే పేచీలు పెడుతున్నారన్నది పార్టీలో వినిపించే మాట. తాజా ఎపిసోడ్‌లో గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసిన అద్దంకి దయాకర్ చేసిన ఫిర్యాదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దయాకర్.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీలకు లేఖలు రాసిపడేశారు. లేఖలతో సరిపెట్టకుండా నేరుగా రాహుల్ గాంధీని కలిసి ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేయబోతున్నారు.
దామోదర్‌రెడ్డి జోక్యంపై దయాకర్ గుర్రు
అద్దంకి దయాకర్ ఫిర్యాదుతో కాంగ్రెస్ వర్గాల్లో తుంగతుర్తి చర్చగా మారిపోయింది. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా దయాకరే ఉన్నారు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్‌గా మారకముందు ఇక్కడ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గంగా మారిన తర్వాత సూర్యాపేటకు షిఫ్ట్ అయ్యారు మాజీ మంత్రి. కానీ.. తుంగతుర్తిపై పట్టుకోల్పోకుండా చేసుకుంటున్నారట. 2018 ఎన్నికల్లోనే తన అనుచరుడు డాక్టర్ రవిని కాంగ్రెస్‌లో బరిలో దించేందుకు దామోదర్‌రెడ్డి ప్రయత్నించారు. కానీ.. పార్టీ దయాకర్‌కు బీఫాం టికెట్ ఇవ్వడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కూడా డాక్టర్ రవి కోసమే.. తనను తుంగతుర్తిలో తిరగనివ్వకుండా దామోదర్‌రెడ్డి అడ్డుకుంటున్నారన్నది దయాకర్ ఆరోపణ. ఈ అంశంలో మాజీ మంత్రికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు దయాకర్. తాజాగా పార్టీ చీఫ్‌కు చేసిన ఫిర్యాదులో ఈ అంశాలనే ప్రస్తావించారు.
మరోసారి కుట్ర చేస్తున్నారని దయాకర్ ఆరోపణ
2018 ఎన్నికల్లో తనకు పార్టీ నుంచి ఆర్థికసాయం అందకుండా దామోదర్‌రెడ్డి అడ్డుకున్నారని దయాకర్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఆ ఎన్నికల్లో చివరిక్షణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా హ్యాండిచ్చారని .. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు దయాకర్. 2018లో టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా పనిచేసిన డాక్టర్ రవిని తిరిగి తెరమీదకు తీసుకొచ్చేందుకు దామోదర్‌రెడ్డి, ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో రాజీకి భట్టి విఫలయత్నం..!
తుంగతుర్తి అంశంపై రెండేళ్ల క్రితమే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఎదుట పంచాయితీ జరిగింది. దామోదర్‌రెడ్డి, అద్దంకి దయాకర్ మధ్య గ్యాప్ పూడ్చే ప్రయత్నం చేశారు. కానీ.. అది పూర్తిస్థాయిలో సాగలేదు. దామోదర్‌రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశిస్తూనే.. తుంగతుర్తిలో అనుచరులకు టికెట్ ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. తాను ఇంఛార్జ్‌గా ఉన్న నియోజకవర్గంలో ఈ కుట్ర లేంటన్నది దయాకర్ ప్రశ్న. అయితే సూర్యాపేటలో కాంగ్రెస్ నుంచి పటేల్ రమేష్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రమేష్‌రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనిషి. ఆ పంచాయితీ కూడా సెగలు రేపుతోంది. రమేష్‌రెడ్డి జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు దామోదర్‌రెడ్డి. మరి.. అదే మాజీ మంత్రి తుంగతుర్తిలో ఎలా వేలు పెడతారని ప్రశ్నిస్తున్నారు దయాకర్.
పెద్దగా జోక్యం చేసుకోని రేవంత్‌రెడ్డి
నల్గొండ కాంగ్రెస్ రాజకీయాల్లో జానారెడ్డి కాస్త సైలెంట్‌గానే ఉంటున్న.. మిగిలిన నాయకులు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. దీంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంలో.. పెద్దగా జోక్యం చేసుకోవడం లేదట. అందుకే పీసీపీపై దయాకర్ అలకతో ఉన్నట్టు సమాచారం. మరి.. కాంగ్రెస్‌లో సరికొత్తగా తెరపైకి వచ్చిన ఈ వివాదానికి పార్టీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.
