Site icon NTV Telugu

Munugodu Politics : ఉమ్మడి నల్గొండలో మూడో ఉపఎన్నిక వస్తుందా..? కసరత్తుల్లో పడ్డ పార్టీలు

Manugodu Trs

Manugodu Trs

Munugodu Politics : మునుగోడుపై ఎవరి లెక్కలు వాళ్లవేనా? ఉపఎన్నిక వస్తే పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీ ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతోంది? సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ ఏం చేయబోతుంది? బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? లెట్స్‌ వాచ్‌..!

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుతో మునుగోడులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేయబోతున్నాయనే ఆసక్తి పెరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారా? ఆయన రాజీనామా చేయకపోతే.. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేస్తారా? ఇందులో ఏది జరిగినా మునుగోడులో ఉపఎన్నిక ఖాయం. అదే జరిగితే 2018 తర్వాత ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగే మూడో ఉపఎన్నికగా మునుగోడు నిలిచిపోనుంది. ఇంతకుముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో హుజూర్‌నగర్‌, నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌లో ఉపఎన్నికలు జరిగాయి. వీటిల్లో కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోగా.. నాగార్జునసాగర్‌లో పట్టు నిలుపుకొంది టీఆర్ఎస్‌. ఇప్పుడు మునుగోడు విషయానికి వస్తే జరగబోయే రాజకీయం రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు.

2018 ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్ఎస్‌ కోల్పోయింది. ఇక్కడ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచి చర్చల్లోకి వచ్చారు. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైతే తిరిగి గులాబీ జెండా రెపరెపలాడించాలనే కసితో ఉందట. అక్కడ టీఆర్ఎస్‌ రాజకీయ కదలికలు పెరిగాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే బైఎలక్షన్‌గా భావించి.. రణతంత్రం పక్కాగా రచిస్తుందని భావిస్తున్నారు. తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టడం.. పవర్‌లోకి వస్తామని చెబుతున్న బీజేపీకి సమాధానం చెప్పడం టీఆర్ఎస్‌ ముందు ఉండే సవాళ్లు. 2018 తర్వాత రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండు టీఆర్ఎస్‌.. రెండు బీజేపీ గెలుచుకున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మునుగోడు టీఆర్ఎస్‌లో విభేదాలను చక్కదిద్దే పనిలో మంత్రులు పడ్డారు. ఇక్కడ టికెట్‌ కోసం టీఆర్ఎస్‌ నేతల్లో పోటీ ఉంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజవర్గం కావడంతో ఆ సామాజికవర్గానికి ఛాన్స్‌ ఇస్తారా లేక మాజీ ఎమ్మెల్యేను నిలబెడతారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. వీరేవరూ కాకుండా.. ఉపఎన్నిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉన్నా.. వాళ్లను ముందుకు నడిపించే అభ్యర్థిని తెరపైకి తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులంతా సీనియర్లే. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గం.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. భువనగిరి ఎంపీగా కాంగ్రెస్‌ లీడర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డే ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలిచాక.. కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలను ఎదగకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయట. పార్టీ కూడా ఇక్కడ పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు. ఇప్పుడు ఉపఎన్నిక అనివార్యమైతే.. నల్లగొండ జిల్లా నాయకుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. పాల్వాయి గోవర్దనరెడ్డి కుమార్తె స్రవంతి కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఆమెకు టికెట్‌ ఇస్తారా లేక.. టీఆర్ఎస్‌, బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా మరో ఎత్తుగడ వేస్తారా అనేది తేలాల్సి ఉంది.

బీజేపీ విషయానికి వస్తే.. నల్లగొండ, ఖమ్మం జిల్లాలో పార్టీ వీక్. మునుగోడులో లెఫ్ట్‌ పార్టీల ప్రభావం కూడా ఎక్కువే. బీజేపీకి కేడర్‌ లేదు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మనోహర్‌రెడ్డి కొన్ని పర్యాయాలుగా పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి.. పోటీ చేస్తే మాత్రం సమీకరణాలు మారొచ్చనే అంచనాల్లో కమలనాథులు ఉన్నారు. కేడర్‌ లేనిచోట గెలిచినా.. రెండో స్థానంలో నిలిచినా వచ్చే ఎన్నికలకు మంచి బలం వచ్చినట్టేనని లెక్కలేస్తున్నారట. నల్లగొండ జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడానికి ఉపఎన్నిక ఉపయోగపడుతుందనే అభిప్రాయంలో ఉన్నారట. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకోకుండానే.. మూడు ప్రధాన పార్టీల్లో మునుగోడు పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.

 

Exit mobile version