అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మాజీ మంత్రులు సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి సాగిన సందర్భాలు లేవు. 2014-19 మధ్య అయ్యన్న, గంటా ఇద్దరు చంద్రబాబు కేబినెట్ మంత్రులు. ఆ సమయంలోనూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదే. ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యన్న గళం విప్పుతుంటే.. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు పార్టీ మారిన చరిత్ర గంటాది.
విశాఖ భూ కుంభకోణం అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. సహచర మంత్రిగా ఉన్న గంటా ప్రమేయంపై విచారణ కోరుతూ సిట్‌కు ఫిర్యాదు చేశారు అయ్యన్న. వాళ్ల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అద్దం పడుతుంది. 2019 ఎన్నికల తర్వాత అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్‌పై ఫోకస్ పెట్టారాయన. వచ్చే ఎన్నికల్లో విజయ్ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయంగా డైలమాలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. యాక్టివ్ పాలిటిక్స్‌కు మూడేళ్లుగా దూరంగా ఉన్నారు. పార్టీ మారిపోతారనే ప్రచారాలు జరిగాయి. వైసీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్నిపార్టీలవైపు గంటా చూస్తున్నారనే చర్చ నడిచింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన.. అది ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఎన్నికలకు మరో రెండేళ్లు ఉందనగా గంటా తెరపైకి వచ్చారు. తరచూ విశాఖలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్తున్నారు. నియోజకవర్గంలోనూ కార్యకలాపాలను పెంచాలని శ్రేణులకు నిర్దేశిస్తున్నారట. పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటిసారి లోకేష్ బర్త్‌డే వేడుకలు నిర్వహించి నాయకులను, కేడర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు గంటా.
కొద్దిరోజుల క్రితం విశాఖ వచ్చిన లోకేష్‌ను గంటా తనయుడు రవితేజ కలవడం చర్చగా మారింది. దీంతో రేపోమాపో చంద్రబాబుతో గంటా సమావేశం అవుతారని.. రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీకి వస్తారని టాక్. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో చంద్రబాబుతో కలిసి గంటా దిగిన ఫోటో వైరల్ అయింది. సాధారణంగా ఈ ఫోటోకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ, TNSF వర్క్‌షాప్‌లో అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్‌తో కొత్త చర్చ మొదలైంది. మూడేళ్లు పుట్టల్లో దాక్కున్న బురదపాములు మళ్లీ బయటకు వస్తున్నాయని.. కేడర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వాళ్లను పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అయ్యన్న కుండబద్దలు కొట్టేశారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన వ్యాఖ్యలు గంటా వర్గానికి గట్టిగానే తగిలాయి. దీంతో ఈ డైలాగ్ వార్ వెనక అసలు స్టోరీ ఏంటనే ఆసక్తికరమైన చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో గంటా తిరిగి భీమిలి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. తన వర్గాన్ని యాక్టివేట్ చేస్తున్నారట. అయితే భీమిలి ఇంఛార్జ్‌గా కోరాడ రాజబాబును నియమించుకుని కార్యకలాపాలు నిర్వహిస్తోంది టీడీపీ. మరోసారి గంటా కోసం భీమిలిలో మార్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో ఉందట హైకమాండ్. ఈ అంశంలో క్లారిటీ లేకపోయినా.. ఇటీవల అనకాపల్లి జిల్లా పరిధిలోని నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టారట గంటా. యలమంచిలి, చోడవరం నుంచి తరచు నాయకత్వం వచ్చి గంటాను కలిసి వెళుతోంది. 2004లో గంటా చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అక్కడో వర్గం ఉంది. అయితే రాజకీయంగా అయ్యన్న, గంటాలు పరస్పరం ఎంత వరకు సహకరించుకుంటారనేది సందేహమే. పార్టీ హైకమాండ్ గంటాకు క్లారిటీ ఇస్తే ఈ హీట్ మరింత ఎక్కువవుతుందా.. లేక అనకాపల్లి జిల్లాకు అయ్యన్న , విశాఖ జిల్లాకు గంటా ఫిక్స్ అవుతారో చూడాలి.