Site icon NTV Telugu

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎంత మందికి మళ్లీ ఛాన్స్ ఉంది? ఉపఎన్నికల్లో గెలిచి రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నవారి సీటు సేఫేనా? టీఆర్ఎస్‌ అధిష్ఠానం లెక్కలేంటి?

రెండేళ్లే ఎమ్మెల్సీగా ఉన్నవారికి రెన్యువల్‌..!

తెలంగాణలో జనవరి నాలుగుతో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్‌ పదిన పోలింగ్. ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్‌, వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండలో జిల్లా తేర చిన్నపరెడ్డి, మెదక్ జిల్లాలో భూపాల్‌ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత, ఖమ్మం జిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లాలో నారదాసు లక్ష్మణ్, భానుప్రసాద్ రావు, మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజుల పదవీకాలం
ముగుస్తోంది. ఈ పన్నెండు మందిలో నలుగురు ఉపఎన్నికల్లో గెలిచిన వాళ్లు. భూపతిరెడ్డి పై అనర్హత వేటు, కొండా మురళీ పార్టీ మారడంతో రెండు ఖాళీ కాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్, పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో అప్పట్లో నాలుగుచోట్ల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ప్లేస్‌ల నుంచి కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు అయ్యారు. రెండేళ్లు మాత్రమే ఈ నలుగురు పదవుల్లో ఉండటంతో వీరికి రెన్యువల్‌ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసినవాళ్ల పరిస్థితి ఏంటి ?

ఈ పన్నెండు మందిలో రెండుసార్లు ఎమ్మెల్సీలుగా చేసినవాళ్లు మరో నలుగురు ఉన్నారు. వారే బాలసాని, భాను ప్రసాదదరావు, భూపాల్‌రెడ్డి, నారదాసు. ఇద్దరు కాంగ్రెస్‌ నుంచి ఒకసారి గెలిస్తే..
మిగతా ఇద్దరు టీఆర్‌ఎస్‌ నుంచే రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు. వీరి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్న. పూర్తిస్థాయి మెజార్టీ అధికార టీఆర్‌ఎస్‌కే ఉన్నా.. కొత్తవారికి ఛాన్స్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందట.

కొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దించుతారా?
మొత్తంగా 19 ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి పార్టీలో వడపోతలు..!

12 మంది జాబితాలో మరికొందరికి కూడా సీటు నిరాకరించే ఛాన్స్‌ ఉందని చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారిని తప్పించాలని చూస్తున్నారట. ఈ జాబితాలో ఉన్నవారిలో కొందరు ఎమ్మెల్సీ కాదు… ఎమ్మెల్యే కావాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వారిలో పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. అలాగే సొంత బలం ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్థికంగా అంతో ఇంతో ఆదుకునేవారినే మళ్లీ బరిలో పెట్టనున్నారు. ఆర్థికంగా బాగా బలహీనం ఉన్న వారికి మాత్రం పార్టీ అండగా నిలిచే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే 12లో కొత్త ముఖాలు ఎన్ని అనేది ఉత్కంఠగా మారింది. గవర్నర్‌ కోటాలో ఒకటి.. ఎమ్మెల్యే కోటాలో ఆరు, స్థానిక సంస్థల కోటాలో 12 అన్ని కలిపి 19 ఎమ్మెల్సీలు ఒకేసారి రావడంతో సామాజిక సమీకరణలు, జిల్లాల లెక్కలు వేసుకుని అభ్యర్థుల వడపోతలు చేపట్టింది అధిష్ఠానం. ఆ 19 మంది ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చ.

Exit mobile version