వారిద్దరూ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. కలిసి మెలిసి కనిపించేవారు. సడెన్‌గా ఇద్దరూ ఎడముఖం పెడముఖం. ఓ రేంజ్‌లో కోల్డ్‌వార్ ఉన్నట్టు టాక్. ఇద్దరి మధ్య ఏ విషయంలో చెడింది? ఎవరా నాయకులు? ఏమా కథ?
నల్లగొండలో ఎవరికి వారే..!
భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ. ఇద్దరూ అధికార టీఆర్ఎస్ నాయకులే. నల్లగొండలో ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు వేయని ఎత్తుగడలు లేవు. దీంతో అధికారపార్టీలో కోల్డ్‌వార్ సెగలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ గెలవాలనే ఆలోచనలో ఉన్నారు భూపాల్‌రెడ్డి. ఆ మేరకు కార్యక్రమాలు జోరు పెంచారాయన. ఇదే సమయంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా నల్లగొండలో గేర్ మార్చేశారు. తన కుమారుడు అమిత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం గుత్తా వ్యూహ రచన చేస్తున్నారట. అమిత్ కూడా నల్లగొండలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం లోకల్ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తోంది.
వేర్వేరుగా సీఎం పుట్టినరోజు వేడుకలు
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నల్లగొండలో భూపాల్‌రెడ్డి, గుత్తా వర్గాల మధ్య వర్గపోరు బయటపడింది. ఎవరికి వారుగా వేడుకలు.. అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అధికారపార్టీ కేడర్‌లో అయోమయం నెలకొందట. గుత్తా వైపు వెళ్లాలా.. ఎమ్మెల్యే శిబిరంలోనే ఉండాలో కొందరు తేల్చుకోలేకపోతున్నారట. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేపట్టిన కార్యక్రమాలకు హాజరై ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తపడ్డారు.
ఒకరి పొడ ఇంకొకరికి గిట్టడం లేదట
వాస్తవానికి నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు భూపాల్‌రెడ్డి. ఇదే ప్రాంతానికి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. కొత్తలో ఇద్దరూ కలిసిసాగినా.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒకరి పొడ ఇంకొకరికి గిట్టడం లేదు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఎమ్మెల్యే అన్నదానం నిర్వహిస్తే.. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సుఖేందర్‌రెడ్డి మరోచోట ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఆధిపత్యపోరు ఎఫెక్ట్ నల్లగొండలోనూ కనిపిస్తోందా?
ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌లోని ఆధిపత్య పోరు కూడా నల్లగొండ నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తున్నట్టు సమాచారం. గుత్తాకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్‌లో మరికొందరు కూడా ప్రయత్నిస్తున్నారట. ఒకప్పుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్‌రావులు ప్రస్తుతం దూరం జరిగారు. ఆ మధ్య కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఆహ్వానం అందగా.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి పిలుపు లేదట. ఆధిపత్యపోరులో భాగంగానే గుత్తాను పిలవలేదని పార్టీ వర్గాల టాక్.
దీని వెనక ఒక మంత్రి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వంతు వచ్చింది. మరి రానున్న రోజుల్లో నల్లగొండ టీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.