MLA Vasupalli Ganesh Kumar : ఆ నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు అధికారపార్టీకి పంటికింద రాయిలా మారాయా? ప్రత్యర్థుల ఎత్తుగడలు భరించలేక ఎమ్మెల్యే సొంత గూటికి వెళ్లిపోదామనుకున్నారా? సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరించారు? కాలపరీక్షలో నిలుచున్న నాయకులు ఎవరు? లెట్స్ వాచ్..!
విశాఖ దక్షిణ వైసీపీలో రాజకీయ కుమ్ములాటలు ముదిరిన వేళ కీలక పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జైకొట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూసిన సీతంరాజు సుధాకర్ మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఆధిపత్యపోరాటంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. సమస్య జఠిలంగా మారుతుందేమో అని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్న సమయంలో వైసీపీ పెద్దలు చూపించిన పరిష్కారం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. దీంతో సమస్య తాత్కాలికంగా కొలిక్కి వచ్చినా.. ఇద్దరు నాయకులు కాలపరీక్ష ముందు నిలుచున్నారని అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సీతంరాజు సుధాకర్‌ను ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎమ్మెల్యే వాసుపల్లి శిబిరం ఫుల్ ఖుషీగా ఉంది. సీతంరాజు విజయం కోసం తానే ముందుండి కృషి చేస్తానని వాసుపల్లి ప్రకటనలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో వాసుపల్లి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాది తిరగక్కుండానే వైసీపీకి జై కొట్టేశారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం తర్వాత దక్షిణ నియోజకవర్గంలో వైసీపీకి నాయకత్వం ఉన్నప్పటికీ.. ఎన్నికల రాజకీయాలు చేసే సమర్థులు లేరనే లోటు కనిపించింది. ఆ వాతావరణాన్ని వాసుపల్లి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో గొడవలు మొదలయ్యాయి.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యేకు పార్టీ ముఖ్యనేతల మధ్య సఖ్యత చెడింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తోపాటు పార్టీ కార్పొరేటర్ల ఎత్తుగడలతో ఎమ్మెల్యేకు ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తింది. దీంతో మళ్లీ టీడీపీకి వెళ్లేదుకు ఎమ్మెల్యే వాసుపల్లి ఆలోచిస్తున్నారనే ప్రచారం బయటకొచ్చింది. రీఎంట్రీ కుదరకపోతే జనసేనలోకి వెళ్లయినా పోటీ చేస్తారనే చర్చ సాగింది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్యే. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాయడమే కాకుండా తన అసంతృప్తిని వాసుపల్లి బయట పెట్టారు. ఈ అనుకోని పరిణామాలతో వైసీపీ హైకమాండ్ జాగ్రత్త పడింది. ఏ చిన్నపాటి నిర్ణయం అయినా ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని భావించి బుజ్జగింపులకు తెరతీసింది. ఎంత స్పీడుగా రాజీనామా లేఖ పంపించారో అదే వేగంతో ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే. చివరకు ఆ వర్గపోరు టీకప్పులో తుఫాన్ గా మిగిలిపోయింది.
దక్షిణ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ నిర్వహించగా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ముఖం చాటేశారు. మీటింగ్ ముగిసిన తర్వాత ప్లీనరీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్‌ను కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైసీపీలో రాజకీయ ప్రత్యర్థిగా మారిన సీతంరాజు దూకుడు వాసుపల్లికి మింగుడు పడలేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా అంతర్గత పోరును భరించడం ఎమ్మెల్యేకు తలపోటుగా మారిందనే అభిప్రాయం కలిగింది. ఇంతలో అధిష్ఠానం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సీతంరాజును ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. సీతంరాజు ఎమ్మెల్సీగా గెలిస్తే తనపని తాను చేసుకుంటారని ఎమ్మెల్యే అనుకుంటున్నారట. ఒకవేళ ఎమ్మెల్సీగా ఓడిపోతే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. గెలుపు గుర్రాలకే టికెట్ అని సీఎం జగన్ చెప్పడంతో.. ఆయన్ని పక్కన పెట్టి వాసుపల్లికే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారట. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఏమో కానీ.. ఇద్దరు నేతలకు కాలం పెద్ద పరీక్షే పెట్టిందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.