OTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు జిల్లా కేంద్రంలో భారీ సభ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యర్రమంలో పాల్గొన్నారు. కానీ… ఒక్కరు మాత్రం డుమ్మా కొట్టారు. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారాయన. నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా…. అధికారిక కార్యక్రమాల కోసం జిల్లాకు సీఎం వచ్చారంటే… సహజంగానే అక్కడ ఉండే ఎమ్మెల్యేలంతా ఆయనతో పాటు ఉంటారు. అంతా సొంత పార్టీ వాళ్లయితే ఇక చెప్పే పనేలేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం… కాంగ్రెస్ శాసనసభ్యుడే అయినా…. ముఖ్యమంత్రి సభకు హాజరవలేదు. దీంతో…. సీఎం నల్గొండ జిల్లా కార్యక్రమానికి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎందుకు డుమ్మా కొట్టారు? అసలు రీజన్ అదేనా? అంటూ చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి. అయినా ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతోంది. తనకు నేరుగా పార్టీ అధిష్టానమే మాట ఇచ్చింది కాబట్టి… పదవి ఇచ్చి తీరాల్సిందేనన్నది ఆయన ప్రధాన డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైకమాండ్ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం… కీలక నేతలతో భేటీ అయ్యారు కూడా. రాహుల్ గాంధీని కలిసి అసలు విషయాన్ని చెప్పేశారు. కానీ… కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ వాయిదా పర్వం నడుస్తూనే ఉంది. ప్రత్యేకించి తనకు కేబినెట్ బెర్త్ దక్కడం లేదనే ఫీలింగ్ రాజగోపాల్‌రెడ్డిలో బలంగా ఉందట. దీనికి తోడు… తనకు పదవి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా ఆయనకు బలంగా ఉందని చెప్పుకుంటున్నారు. సీఎం టూర్‌లో కనిపించకపోవడానికి, ఈ అసంతృప్తికి లింక్ ఉందన్నది రాజకీయవర్గాల అనుమానం. స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు వచ్చినా ఆయన సభకు ఎమ్మెల్యే దూరంగా ఉండటం అంటే… తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేయడమేనన్న భావన ఉంది కొన్ని వర్గాల్లో. తనకు కేబినెట్‌లో ఛాన్స్ దక్కక పోవడం, విస్తరణ వాయిదా పడుతుండటం లాంటివి బలంగా పని చేసి ఉండవచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఐతే రాజగోపాల్ రెడ్డి మాత్రం… పదవులు తనకేం కొత్త కాదని, వాటికోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చుగానీ…. ఆశావహుడిగా ఉన్న ఎమ్మెల్యే సీఎం సభకు డుమ్మా కొట్టడంతో చర్చలన్నీ దాని చుట్టూనే నడుస్తున్నాయి.

