ఆ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యే డిఫెన్స్‌లో పడ్డారు. ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకతను అధిగమించేందుకు నానా తంటాలు పడుతున్నారట. గెలిచిన తక్కువ సమయంలోనే ఎందుకు సీన్ రివర్సైంది? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా? లెట్స్ వాచ్..!
ఫోన్ ఎత్తరు.. కేడర్‌ను పట్టించుకోరా?
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి.. తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యమకారునిగా ఉన్న గుర్తింపు .. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో.. సురేందర్‌ను చందాలు వేసుకుని మరీ గెలిపించారని కథలు కథలుగా చెప్పుకొంటారు. అయితే అనుభవం లేకో ఏమో.. తక్కువ సమయంలో వ్యతిరేకత వచ్చేసింది. కార్యకర్తలు ఆపదలో ఉంటే ఫోన్ ఎత్తక పోవడం.. పాత కేడర్‌ను పట్టించుకోవడం లేదనే టాక్ పార్టీ వర్గాల్లోనే ఉంది.
.
కేడర్ దూరం.. ఆలోచనలో పడ్డ ఎమ్మెల్యే
గత ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన వారిని సురేందర్ విస్మరించారని ఆరోపిస్తూ.. ఒక్కొక్కరూ దూరం జరుగుతున్నారట. దీంతో ఆలోచనలోపడ్డ ఎమ్మెల్యే.. నాగిరెడ్డిపేట మండలం తాండూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితను ముఖ్య అతిథిగా పిలిచి.. ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారని అనుకుంటున్నారు. ఎల్లారెడ్డి రాజకీయ తెరపై టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్‌రావు బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. వారితో పోల్చుకుంటే.. సురేందర్ వెనకపడ్డారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.
ఆత్మీయ సమావేశాలను నమ్ముకున్న ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉద్యమ పార్టీలోకి తిరిగి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే కాంగ్రెస్ లేదంటే మరో పార్టీ నుంచైనా పోటీకి మదన్ మోహన్ రెడీ అవుతుండటం సురేందర్‌ను డిఫెన్స్‌లో పడేసిందట. రవీందర్‌రెడ్డి, మదన్ మోహన్‌లను ఎదుర్కొవడం అంత వీజీ కాదనేది చర్చ నడుస్తోంది. ఈ ప్రచారాలకు చెక్ పెట్టి కేడర్‌లో భరోసా నింపేందుకు సురేందర్ ఆత్మీయ సమావేశాలను నమ్ముకున్నారట. టికెట్‌పై ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియక తర్జన భర్జన పడుతున్నారట ఎమ్మెల్యే.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై గుబులు
ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నవారు.. గులాబీ గూటికి చేరుతారనే దాంట్లో నిజమెంతున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తోందట కేడర్. ఈసారి గెలుపు సురేందర్ తీరుపైనే ఆధారపడి ఉందని తెల్చేస్తున్నారట. మరి.. ఈ సమస్యను జాజుల ఎలా అధిగమిస్తారో చూడాలి.
