Site icon NTV Telugu

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన?

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ఏళ్ల తరబడి ఒకే ప్లేస్‌లో పనిచేస్తున్న వారికి రిలీఫ్‌ లభిస్తుందా? ఎస్‌ఐ నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు ఎదురు చూస్తున్న శుభ ఘడియ రానే వచ్చిందా? పోలీస్‌ శాఖలో జరుగుతున్న చర్చ ఏంటి?

ఐదారేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఐపీఎస్‌లు!

తెలంగాణ పోలీస్‌ శాఖలో బదిలీ అనే మాట విని చాన్నాళ్లు అయింది. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్టు.. కుర్చీలకు అతుక్కుపోయి పనిచేస్తున్నారు అధికారులు. డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐలదే కాదు.. ఐపీఎస్‌లదీ ఇదే బాధ. పదోన్నతులు దక్కినా.. ఉన్నచోటే పనిచేయాల్సిన పరిస్థితి. ఐదారేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నవారు పోలీస్‌ శాఖలో ఉన్నారు.

read more : రసవత్తరంగా ఆమదాలవలస రాజకీయం.. తమ్మినేని తనయుడు వర్సెస్ కూన రవి !

మూడేళ్ల క్రితం ఐపీఎస్‌ల బదిలీలు

డిపార్ట్‌మెంట్‌లో సాధారణంగా పోస్టింగ్‌ వచ్చిన రెండు లేదా మూడేళ్లకు బదిలీలు జరుగుతాయి. ట్రాన్స్‌ఫర్‌ కాగానే కొత్త ప్లేస్‌లోకి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. రాష్ట్రంలో ట్రాన్స్‌ఫర్లు లేక అసహనం వ్యక్తం చేస్తున్నారట అధికారులు. కొందరైతే పనిపై దృష్టి పెట్టడం లేదనే టాక్‌ ఉంది. మూడేళ్ల క్రితం ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. అదే లాస్ట్‌. ఈ విషయంలో ప్రభుత్వ వర్గాల వాదన మరోలా ఉంది. వ్యవస్థ సరిగా పనిచేస్తున్న సమయంలో బదిలీలు ఎందుకనే భావన ఉందట. అధికారులు సమర్థమంతంగా పనిచేస్తున్నారు. ఎక్కడా సమస్యలు లేవు. ఇలాంటి తరుణంలో ట్రాన్స్‌ఫర్లు చేసి వారిని ఇబ్బంది పెట్టడం.. ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటోందట. ప్రభుత్వం సదుద్దేశంతోనే ఉన్నా.. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేయడం పోలీస్‌ అధికారులకు కొంత ఇబ్బందికర పరిస్థితి.

పదోన్నతులు లభించినా.. ఎక్కడి వారు అక్కడే డ్యూటీ!

ఒకేచోట ఎక్కువకాలం పనిచేస్తే విమర్శలు, ఆరోపణలు వస్తాయి. అవి వ్యక్తిగతంగా మంచిది కాదని పోలీస్‌ అధికారులు భావిస్తారు. అందుకే రెండేమూడేళ్లకు ట్రాన్స్‌ఫర్‌ కోరుకుంటారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్‌లకు ప్రమోషన్‌ లభించింది. కానీ.. ఎక్కడున్నవారు అక్కడే పనిచేస్తున్నారు. డీఐజీలుగా పదోన్నతి లభించినా.. జాయిట్‌ పోలీస్‌ కమిషనర్‌ హోదాలో.. డీసీపీ స్థాయి పోస్టింగ్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇద్దరు అదనపు డీజీలు… ఒక ఐజీ మాత్రమే ఉన్నారు!

హైదరాబాద్‌ పాతబస్తీకి కొన్నాళ్లుగా పూర్తిస్థాయి డీసీపీ లేరు. ఆ పోస్ట్‌ ఖాళీ అయ్యి చాన్నాళ్లు అయింది. పోలీస్‌ శాఖలో అత్యంత కీలకంగా భావించే స్పెషల్‌ బ్రాంచ్‌కు కూడా పోలీస్‌ అధికారి లేకుండా పోయారు. ఉన్నవారితోనే సర్దుకుపోతున్నారు ఆఫీసర్లు. ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా ఉన్న అధికారి ఐదేళ్లుగా ఆ పోస్ట్‌లో ఉన్నారు. తనను బదిలీ చేయాలని చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో చాలా ఐసీఎస్‌ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఐజీ, డీజీ ర్యాంకుల్లో 8 మంది వరకు అధికారులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు అదనపు డీజీలు, ఒక ఐజీ మాత్రమే పనిచేస్తున్నారు.

డీజీపీ ఆఫీస్‌లోని కీలక విభాగాల్లో అధికారులు లేరు!

సైబరాబాద్‌ పరిధిలోనూ ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి. కొందరు అధికారులు ఒకే పోస్టింగ్‌లో ఏళ్లతరబడి పనిచేస్తున్నారు. కరీంనగర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ల పరిస్థితి ఆ కోవలోకే వస్తుంది. ఇటీవల వరంగల్‌కు కొత్త అధికారిని నియమించారు. డీజీపీ ఆఫీస్‌లోనూ కీలక విభాగాలలో అధికారులు లేరు. ట్రాన్స్‌ఫర్లు.. పోస్టింగ్‌లపై కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఆఫీసర్లు.

త్వరలో బదిలీలు చేపట్టబోతున్నట్టు సమాచారం
ఐదు కమిషనరేట్‌ల పరిధిలో పెద్దఎత్తున బదిలీలు!

ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఓ సమాచారం డిపార్ట్‌మెంట్‌కు అందినట్టు చెబుతున్నారు. కిందిస్థాయి నుంచి అదనపు డీజీ హోదా కలిగిన అధికారుల వరకు బదిలీలు ఉంటాయట. ఇటీవలే రాష్ట్రంలో ఇన్‌స్పెక్టర్‌లకు డీఎస్పీలుగా.. డీఎస్పీలను అదనపు ఎస్పీలుగా.. అదనపు ఎస్పీలను ఎస్పీలుగా ప్రమోట్‌ చేశారు. వీరంతా ఇప్పుడు బదిలీల జాబితాలో ఉంటారని సమాచారం. కీలక స్థానాల్లో మార్పులు ఉంటాయని అనుకుంటున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్‌లలో ట్రాన్సఫర్లు పెద్దఎత్తున ఉండొచ్చని డిపార్ట్‌మెంట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎస్‌ఐ నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు ఆ శుభ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారట. అయితే బదిలీలతో సరిపెడతారా.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన దిశగా చర్యలు ఉంటాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version