Site icon NTV Telugu

Mantri Srinivas : సడెన్ గా పంజాబ్, చండీగఢ్ కి పంపేశారు బండి సంజయ్ తో పడటం లేదా?

Srinivas

Srinivas

Mantri Srinivas : తెలంగాణలో ఎన్నికలు అప్పుడా.. ఇప్పుడా అని అనుకుంటున్న సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సంస్థాగత ప్రధాన కార్యదర్శిని ఇక్కడ నుంచి సాగనంపింది. కీలక సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏమై ఉంటుందా అని కింది నుంచి పైవరకు పార్టీలో ఒకటే చర్చ.

మంత్రి శ్రీనివాస్‌. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి. పార్టీలో చాలా మంది ప్రధాన కార్యదర్శలు ఉన్నప్పటికీ.. మంత్రి శ్రీనివాస్‌ స్థానం వేరు. ఆయన సంస్థాగత వ్యవహారాలు చూస్తారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తర్వాత కీలక పోస్ట్‌ అది. సంఘ్‌ పరివార్‌ క్షేత్రాల్లో ఫుల్‌ టైమర్స్‌గా పనిచేస్తున్న వారిని ఆ పదవుల్లో నియమిస్తారు. మంత్రి శ్రీనివాస్‌ అదే విధంగా ABVP నుంచి వచ్చి బీజేపీ కార్యక్షేత్రంలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయనే సంస్థగత ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపల్‌, పరిషత్‌, పంచాయితీ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల మూడ్‌ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో వ్యూహరచన సాగుతోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి.. ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభనూ ఏర్పాటు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో.. మంత్రి శ్రీనివాస్‌ను తెలంగాణ నుంచి పంజాబ్‌-చండీగఢ్‌ సంస్ధాగత ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం. తెలంగాణకు కొత్తగా ఎవరోస్తారో చెప్పకపోయినా.. వెంటనే చండీగఢ్‌ వెళ్లి బాధ్యతలు చేపట్టాలని పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకు సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నారన్నదే కాషాయ శిబిరంలో పెద్ద చర్చగా మారింది.

ఎన్నికల సన్నాహాల్లో ఉన్న సమయంలో మంత్రి శ్రీనివాస్‌ను పంపించేయడంపై బీజేపీలో ఎవరి విశ్లేషణ వాళ్లదే. ఈ సమయంలో కొత్తగా తెలంగాణకు ఎవరొచ్చినా పార్టీ పరిస్థితిని అర్థం చేసుకొనే లోపుగాన పుణ్యకాలం గడిచిపోతుందనేది కొందరి వాదన. తెర వెనక ఏదో జరిగి ఉంటుందని.. అందుకే సడెన్‌గా రాష్ట్రం నుంచి పంపించేశారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. బలమైన ఆరోపణలు ఏమైనా వచ్చాయా అన్నది ఇంకొందరి అనుమానం.

బండి సంజయ్‌తో గ్యాప్‌ ఉన్న వాళ్లు శ్రీనివాస్‌తో అటాచ్‌ అయ్యారట. ఇప్పుడు పార్టీలో వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. చేరికలపై ప్రభావం పడుతుందా అని ఆరా తీసేవాళ్లూ ఉన్నారట. అయితే .. ఇక్కడ ఇంకో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీనివాస్‌ వచ్చాక.. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిలో పలువురికి పార్టీతో గ్యాప్‌ వచ్చేసింది. దానికి ఆయనే కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో టికెట్‌ కేటాయింపు అంశంలో అనేక ఆరోపణలు వచ్చాయని.. ప్రస్తుతం పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వీటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. ఇంత సడెన్‌గా పంజాబ్‌కు పంపడమే ఆ అనుమానాలను బలపర్చేలా ఉందన్నది కొందరి అభిప్రాయం. బండి సంజయ్‌తోనూ మంత్రి శ్రీనివాస్‌కు గ్యాప్‌ వచ్చిందనే టాక్‌ కూడా నడుస్తోంది.

సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు ఇతర రాష్ట్రాలకు.. సంఘ పరివార్‌ క్షేత్రాల్లో ఇతర విభాగాలకు వెళ్లడం జరుగుతూనే ఉంటుంది. గతంలో ఉమ్మడి ఏపీకి ఇలా చాలా మంది వచ్చి పనిచేశారు. కానీ.. మంత్రి శ్రీనివాస్‌పై జరిగినంత చర్చ వారెవరిపైనా జరగలేదని గుర్తు చేసుకుంటున్నారు కమలనాథులు. ఆరోపణలు ఉంటే బీజేపీలో మరో రాష్ట్రానికి పంపరన్నది సంఘ్‌తో అనుబంధం ఉన్నవాళ్లు చెప్పేమాట. మరి.. ఎన్నికల వ్యూహంలో భాగంగా.. మరో సీనియర్‌ను తెలంగాణకు పంపుదామని బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందో ఏమో కాలమే చెప్పాలి.

 

Exit mobile version