Site icon NTV Telugu

TDP : నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి పదవి కోసం లాబీయింగ్..! |

New Project (48)

New Project (48)

విజయనగరం జిల్లాలో రాజకీయంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతోపాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. విశాఖ-విజయనగరం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్. విశాఖకు దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మూడేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్నా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్‌ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు. నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జ్‌ పదవి కోసం పెద్ద స్థాయిలోనే లాబీయింగ్‌ చేస్తున్నారట.

మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి వయసు మీద పడటంతో కొత్త ఇంఛార్జ్‌ నియామకం అనివార్యమని తేల్చేసింది టీడీపీ అధిష్ఠానం. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఇంఛార్జ్‌ పోస్ట్‌ కోసం పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి.. భోగాపురం మండలానికి చెందిన బంగార్రాజు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావులు రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు పతివాడ మనవడు తారక రామారావు సైతం నేనున్నాను అని చెబుతున్నారు. వనజాక్షి సోదరుడు ఆనందకుమార్‌ పేరూ చర్చల్లో నలుగుతోంది.

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆశీసులు ఉన్న వారికే ఇంఛార్జ్‌ పదవి వస్తుందనేది ఒక టాక్‌. అందుకే ఆయన శిబిరానికి చెందిన నేతలు ఫుల్‌ జోష్‌లో ఉన్నారట. ఆ మధ్య చంద్రబాబు శ్రీకాకుళం వస్తే.. భోగాపురం దగ్గర ఘన స్వాగతం చెప్పిన బంగర్రాజు సైతం ధీమాగానే ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు పేర్లు చర్చల్లో ఉన్నప్పటికీ పతివాడ నారాయణస్వామి అభిప్రాయాన్ని కూడా పార్టీ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఆయన ఎవరికి ఓటు వేస్తారు? ఎవరి పేరును టీడీపీ పెద్దలకు ప్రతిపాదిస్తారు అనేది సస్పెన్స్‌.

ఒకవేళ పతివాడ కుటుంబానికి ఇవ్వకూడదు అని అనుకుంటే .. ఆయన ఎవరి పేరు సిఫారసు చేస్తారనేది కూడా కీలకమే. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తుండటంతో ఆయన ఈ అంశాన్ని కొలిక్కి తేవచ్చనే అభిప్రాయం ఉంది. నెల్లిమర్లలో మారుతున్న రాజకీయ వాతావరణం.. ఇక్కడి పరిస్థితులు.. అభివృద్ధి చూశాక నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. మరి.. ఆశావహుల్లో చంద్రబాబు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

 

Exit mobile version