NTV Telugu Site icon

కృష్ణాజిల్లా ఉద్యోగ వర్గాల్లో మొదలైన అలజడి!

పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఈ క్రమంలో కొందరు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడా భాగోతాలు వెలుగులోకి రావడంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు.  

గ్రామాల్లో స్పెషల్‌ ఆఫీసర్ల మేత!

కృష్ణాజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం వెయ్యికిపైగా పంచాయతీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ డివిజన్లోని మేజర్ పంచాయతీల ఆదాయం 50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో రెండున్నరేళ్లు పైగా ఈ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. ఆ కాలంలో పంచాయతీ కార్యదర్శి… మరో గెజిటెడ్‌ అధికారి పాలనా వ్యవహారాలను చక్కబెట్టేవారు. వారిని జిల్లా స్థాయిలో డీఎల్పీవో పర్యవేక్షించేవారు. అయితే పైస్థాయిలో మానిటరింగ్‌ సరిగా లేక కొందరు అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారట.  వాటిపై ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.

ఓచర్లపై రూ. లక్షల్లో లావాదేవీలు!

కోటి రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తేలప్రోలు పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది. ఈ జాబితాలో మరికొన్ని పంచాయతీ కార్యదర్శుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకున్న అక్రమార్కులు.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఓ కీలక అధికారితో మంత్రాంగం చేస్తున్నారట. బ్యాంకుల ద్వారా జరగాల్సిన లావాదేవీలను.. ఓచర్ల ద్వారా చేపట్టిన అకౌంట్లు తారుమారు చేసినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు కోవిడ్‌ సమయంలో శానిటైజేషన్‌ చేశామని లక్షన్నర కు ఓచర్‌ రాసి లక్ష సిబ్బందికి, 50 వేలు మిగతావారు పంచుకున్నారట.

తప్పులు కప్పిపుచ్చే పనిలో ఓ అధికారి!

పారిశుద్ధ్యం, వీధి దీపాలు, కాల్వల పూడికతీత వంటి పనుల పేరుతో చాలా మంది నిధులు బొక్కేసినట్టు చెబుతున్నారు. జగ్గయ్యపేట పరిధిలోని ఓ మేజర్‌ పంచాయతీలో 11 లక్షల విలువైన  వర్క్‌ను రెండేళ్ల బిల్లులో చూపించారట. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో పంచాయతీలో లెక్కలు చూపించకుండా 60 నుంచి 70 లక్షలు ఖర్చు చేసినట్లు పుస్తకాల్లో రాసేశారట. గన్నవరం పరిధిలోని చాలా గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.  ఓ అధికారి అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించకుండా ఫైల్స్‌ అన్నీ తన దగ్గరకే తెప్పించుకున్నారట. అందులో అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చి నట్టు చెబుతున్నారు.

 అధికార పార్టీ నేతల దగ్గరకు అక్రమార్కులు క్యూ!

ఈ అక్రమాలపై కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ఉప్పందడంతో సర్కార్ సీరియస్‌ అయినట్టు సమాచారం. విజిలెన్స్‌ విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  అయితే  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఒక జట్టుగా ఏర్పడి అధికార పార్టీ నేతలను కలిసి లాబీయింగ్‌ చేస్తున్నారట. మరి.. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వర్గాల్లో గుబులు రేపుతున్న ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.