వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ఆ నియోజకవర్గంలో అప్పుడే రేస్ మొదలైందా? రంగంలోకి మూడో కృష్ణుడు రావడంతో మేటర్ రక్తి కడుతోందా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడ మారుతున్న లెక్కలేంటి?
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో లుకలుకలు పెరిగిపోతున్నాయట. బీసీ సామాజిక వర్గానికి చెందిన వనమా వెంకటేశ్వరరావు సర్పంచ్‌గా రాజకీయాలు మొదలు పెట్టి… డిసిసి అధ్యక్షుడిగా 18 ఏళ్ల పాటు పనిచేసి, ఎమ్మెల్యే,మంత్రి పదవులు కూడా నిర్వహించారు. కాంగ్రెస్, వైసీపీ, మళ్లీ కాంగ్రెస్ మీదుగా ఫైనల్లీ బీఆర్‌ఎస్‌లో ఉన్నారాయన. అయితే… వయసు మీద పడటంతో… యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారట. కొడుకు రాఘవకు పొలిటికల్ వారసత్వం ఇవ్వాలని అనుకున్నా… కొన్ని ప్రత్యేక కారణాలు, ఆరోపణలతో బీఆర్‌ఎస్ అధిష్టానం రాఘవ వైపు మొగ్గు చూపడం లేదట. ఆయనకు బదులు నియోజకవర్గానికే చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర వైపు మొగ్గుతూ వచ్చింది కారు అధిష్టానం.
అందుకు తగ్గట్టే…. గత మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని పనిచేశారు వద్దిరాజు. ఈ క్రమంలో… వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రేనని ప్రచారం మొదలైంది. అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కూడా చెప్పుకుంటున్నారు. అయితే… రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వద్దిరాజుకు అవకాశం ఇస్తారా అంటూ పార్టీలోని ఒక వర్గం ప్రశ్నిస్తోంది. అదే సమయంలో మూడు దశాబ్దాల ఆధిపత్యాన్ని వదులుకునేందుకు వనమా కుటుంబం సిద్ధంగా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆరోగ్యం సహకరించకున్నా… అడపాదడపా కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నారు వనమా వెంకటేశ్వరరావు. ఆయన కొడుకు రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉన్నందున… వారసత్వం పోకుండా… రాఘవ కుమార్తె అలేఖ్య ను రంగంలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ ఎపిసోడ్ కూడా తెర మీదికి రావడం అలేఖ్యకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలేఖ్య ఎన్నికల ప్రచారం చేశారు.
అలాగే… ప్రస్తుతం గణపతి నవరాత్రి ఉత్సవాల ఫ్లెక్సీల్లో ఆమె ఫోటోలు కనిపించాయి. తాతతో కలిసి ఉన్న ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో అలేఖ్య అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని, విజయ దశమి రోజున అధికారికరంగా రాజకీయ వారసత్వాన్ని ప్రకటిస్తారంటూ బాహాటంగానే చెబుతున్నారు వనమా వర్గీయులు. ఒకవైపు ఈ వ్యవహారం ఇలా ఉంటే….మరోవైపు ములకలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన ఎన్నారై తాండ్ర వెంకటేశ్వరరావు రేస్‌లోకి వచ్చారు. టిఎన్ ఆర్ ట్రస్ట్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. జాబ్ మేళాలు, వైద్య సాయం, డిగ్రీ కాలేజీకి ఆర్ధిక సాయం లాంటి కార్యక్రమాలతో నేనున్నానని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. తాండ్ర ఇటీవల కేటీఆర్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలన్నీ రాజకీయ కోణంలోనే సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. కొత్తగూడెం కారులోకి మూడో కృష్ణుడు వచ్చాడని కొందరు సెటైరికల్‌గా అంటున్నా… వద్దిరాజును కాదని మిగతా వాళ్ళకు బీఆర్‌ఎస్ అధిష్టానం ఛాన్స్ ఇస్తుందా అన్నది పొలిటికల్ క్వశ్చన్.

