Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : ఆ ఎంపీ దారెటో పార్టీ వర్గాలకు అంతు చిక్కడం లేదా..?

Komamti Reddy Venkat Reddy

Komamti Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy  : ఆయన ఎంపీ. కీలక ఉపఎన్నికలో ఆయన దారెటో పార్టీ వర్గాలకే అంతుచిక్కడం లేదు. ఆ ఎంపీ వైఖరే దానికి కారణం. అంతా తనవైపే చూస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదట. పేచీ ఇంకా కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. ఎందుకలా? ఆయనకొచ్చిన ఇబ్బంది సమసి పోలేదా? ఎవరా ఎంపీ?

తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నికే ప్రస్తుతం కీలక అంశం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిదిలో ఉంది. భువనగిరి ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూనే ప్రస్తుతం పార్టీలో పంచాయితీ నడుస్తోంది. ప్రియాంక గాంధీతో భేటీకి ముందు… కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చేదే లేదని ప్రకటించారు. ప్రియాంక గాంధీతో భేటీ తర్వాత సీన్‌ మారినట్టు కనిపించింది. వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చించారు. దాంతో పార్టీ అవసరం అనుకుంటే .. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్తా అని ప్రకటించారు వెంకటరెడ్డి. సమస్య కొలిక్కి వచ్చిందని భావించినా.. అది నివురు గప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయట.

ప్రియాంకగాంధీతో వెంకటరెడ్డి భేటీ తర్వాత గాంధీభవన్‌లో మునుగోడు అభ్యర్థి ఎంపిక.. ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాలకు ఎంపీ వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. దాంతో ఆయన వస్తున్నారా లేదా అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి వెంకటరెడ్డిది మునుగోడులో సంకట స్థితి. బీజేపీ నుంచి ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డే పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌ పార్టీ.. అటు చూస్తే తమ్ముడు. ఎటు మొగ్గు చూపాలో తెలియక గందరగోళంలో ఉన్నారా? లేక లౌక్యంగా వ్యహరిస్తున్నారా అనేది ప్రశ్న. మునుగోడులో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తానని చెప్పిన వెంటకరెడ్డి.. ఉపఎన్నిక పై నిర్వహిస్తున్న సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ప్రశ్న. మాజీ మంత్రి జానారెడ్డి సైతం ఆ సమావేశానికి జూమ్‌లో హాజరయ్యారు. వెంకటరెడ్డి మాత్రం డుమ్మా కొట్టేశారు.

మునుగోడులో ప్రచార పర్వానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ప్రతి గ్రామానికి ఇంఛార్జ్‌ను నియమించింది. సీనియర్‌ నేత మూడు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లేలా ప్రచార ప్రణాళిక సిద్ధం చేశారు. పీసీసీ మాజీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు మునుగోడులో మీడియాతో మాట్లాడాలని కూడా నిర్దేశించారు. ఆ సమయంలో ఎంపీ వెంకటరెడ్డి కూడా వస్తారనేది పార్టీ నేతలు చెబుతున్న మాట. పార్టీలో అంతా కలిసి ఉన్నారనే మెసేజ్‌ పార్టీ కేడర్‌తోపాటు ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే వెంకటరెడ్డి ఏం చేస్తారనేది ప్రశ్న.

మునుగోడులో కాంగ్రెస్‌ నేతలు మీడియాలో మాట్లాడేందుకు సెప్టెంబర్‌ 3న ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో అందరి దృష్టీ ఆ రోజు ఎవరు వస్తారు? ఎవరూ దూరంగా ఉంటారు? అనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో మొదలైంది. గతంలో కీలక సమావేశాల సమయంలో వివిధ కారణాలతో టచ్‌మీ నాట్‌గా ఉన్న వెంకటరెడ్డి.. ఇప్పుడు కూడా అదే చేస్తారా? అయితే ఏ కారణం చెబుతారు? లేక మనసు మార్చుకుంటారా అనేది చూడాలి.

 

Exit mobile version