Site icon NTV Telugu

Off The Record: కవిత అక్కడ నుంచే సొంత రాజకీయ యాత్ర మొదలవుతుందా..?

Kavitha

Kavitha

Off The Record: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెదుక్కునే పనిలో ఉన్నారా? బతుకమ్మ సాక్షిగానే తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టబోతున్నారా? అందుకు ఆమె ఎంచుకున్న ప్రాంతం గులాబీ దళంలో కలవరం రేపుతోందా? హరీష్‌రావు మీద తీవ్ర ఆరోపణలు చేసిన కవిత ఇక ఆయన్ని డైరెక్ట్‌గా సవాల్‌ చేయబోతున్నారా? ఇంతకీ… ఏం జరగబోతోంది అసలు?

Read Also: Crypto Currency Scam: నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ అరెస్ట్.. ఏ పార్టీ అంటే..?

బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉండి, పార్టీ అధిష్టానం మీదే విమర్శనాస్త్రాలు సంధించి సస్పెండై, తర్వాత రాజీనామా చేశారు కేసీఆర్‌ కుమార్తె కవిత. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్నా.. ఆమె తదుపరి పొలిటికల్‌ స్టెప్స్‌ ఎలా ఉండబోతున్నాయని మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈ క్రమంలోనే.. అలా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్పకనే చెప్పేశారామె. అక్కడా ఇక్కడా ఎందుకు?.. మూలాల్లో నుంచే మొదలుపెడదామన్నట్టుగా ఉన్నాయి కవిత అడుగులు. తన తండ్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక నుంచే రాజకీయ యాత్ర మొదలుపెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారామె. అదీకూడా.. దసరా వేదికగా.. తనకు బాగా గుర్తింపు తెచ్చిన బతుకమ్మ తోడుగా పోరు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే.. చింతమడక వాసులు కొందరు కవిత దగ్గరికి వచ్చి గ్రామంలో జరిగే వేడుకల్లో పాల్గొనమని ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పుట్టిన ఊరు చింతమడక. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. పైగా ఇది పార్టీ సీనియర్‌ లీడర్‌, కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది.

Read Also: Bengaluru: భారీ గుంతలో పడిన స్కూల్ బస్సు… తృటిలో తప్పిన పెన ప్రమాదం

అలాంటి చోట ఈసారి కవిత ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోవడంతో అన్ని వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. గ్రామస్తులు ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చి కవితని కోరడం, తాను తప్పకుండా హాజరవుతానని ఆమె చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బతుకమ్మ సాక్షిగానే… తన తండ్రి, బావకు ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలోనే కవిత సమరభేరి మోగించబోతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి చాలామందికి. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కవిత… రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చర్చ జరుగుతున్న టైంలో… ఈ చర్య ద్వారా ఆమె సమాధానం చెప్పబోతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ లీడర్‌గా కంటే.. తెలంగాణ జాగృతి, బతుకమ్మ వేడుకల ద్వారానే కవితకు పాపులారిటీ ఉంది. ఇప్పుడు అదే బతుకమ్మ వేడుకల ద్వారా ఆమె తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైనట్టు మాట్లాడుకుంటున్నాయి తెలంగాణ రాజకీయవర్గాలు. చింతమడకను ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు విశ్లేషకులు.

Read Also: AP Liquor Scam Case: లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. తెరపైకి కొత్త పేర్లు..!

ఇక, కేసీఆర్‌ పుట్టి పెరిగిన చింతమడకలో తాను చిన్నప్పుడు ఆడుకునే దానిని అని చెబుతూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో ఆత్మీయంగా ముచ్చటించారామె. తెలంగాణ రాష్ట్రం మొత్తం తనను దీవించాలని కోరబోయే ముందు చింతమడక గ్రామస్తుల దీవెనలు కావాలన్నారు. అలా రాష్ట్రం మొత్తం అటెన్షన్‌ని తనవైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు కేసీఆర్‌ కుమార్తె. కేసీఆర్‌ ఓటు ఇప్పటికీ ఇదే గ్రామంలో ఉంది. తమ కుటుంబ పరంగా అంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతం నుంచి మొదలు పెట్టడం ద్వారా సెంటిమెంట్‌ని రగిలించవచ్చని అనుకుంటున్నారట. అదే సమయంలో లోకల్‌ ఎమ్మెల్యే, తాను శతృవుగా భావిస్తున్న హరీష్‌రావుకు కూడా యుద్ధానికి సిద్ధమని సంకేతాలు పంపినట్టు కూడా ఉంటుందని అనుకుంటున్నారట.

Read Also: Thopudurthi Bhaskar Reddy: వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి..

ఎప్పటికైనా తన యుద్ధం హరీష్ రావుతోనే అని చెబుతున్న కవిత.. ఆ నియోజకవర్గ నుంచే మొదటి ప్రోగ్రాం చేయడం, అది కూడా తనకు కలిసి వచ్చిన బతుకమ్మ ప్రోగ్రాం ని ఎంచుకోవడం కచ్చితంగా బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్‌ని పల్లెత్తు మాట అనకుండా, కేటీఆర్‌కు జాగ్రత్తలు చెబుతూ వస్తున్న కవిత.. ఇప్పుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గానికి వెళ్ళి ఏం చెబుతారు, ఎలా మాట్లాడతారు, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం బతుకమ్మ వేడుకల్లో మాత్రమే పాల్గొని వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితుల్నిబట్టి భవిష్యత్తులో… తన తండ్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్దిపేట నుంచి పోటీచేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న చర్చ తాజాగా మొదలవడం ఈ మొత్తం ఎపిసోడ్‌కు కొసమెరుపు.

Exit mobile version