Site icon NTV Telugu

Karimnagar TRS Politics : ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ లో తగ్గేదే లే అంటున్న గులాబీ లీడర్లు

Karimnagar

Karimnagar

Karimnagar TRS Politics : మంత్రి వర్సెస్‌ మాజీ మేయర్‌. కరీంనగర్‌ టీఆర్ఎస్‌లో ప్రస్తుతం వాడీవేడీగా ఉన్న తాజా రాజకీయం. ఓ రేంజ్‌లో మాటల తూటాలు పేలుతున్నాయ్‌. రెండు గ్రూపులు బహిరంగ సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది సమస్య. తగ్గేదే లేదన్నట్టుగా పిడికిలి బిగించడంతో ఇక్కడి గులాబీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.

మంత్రి గంగుల కమలాకర్‌. కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌. ఇద్దరూ అధికార టీఆర్ఎస్‌ నాయకులే అయినప్పటికీ .. ఎదురుపడితే పచ్చగడ్డి భగ్గుమనేలా ఉంటుంది పరిస్థితి. వీరి మధ్య తాజాగా కొత్త రగడ చిచ్చు పెట్టింది. అది ఎక్కడ ఆగుతుంది? ఎంత వరకు వెళ్తుంది? ఎవరు పైచెయ్యి సాధిస్తారు అనేదే స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్న.

కరీనంగర్‌లోని 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమల్‌జీత్‌ కౌర్‌ భర్త సోహన్‌సింగ్‌.. ఓ వ్యాపారితో మాట్లాడిన ఆడియో లీకై.. లోకల్‌ టీఆర్ఎస్‌లో దుమారం రేపుతోంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్‌పై మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ చేస్తున్న కుట్రగా అధికారపార్టీ నేతలు భగ్గుమన్నారు. ఏకంగా 40 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పార్టీ అధిష్ఠానానికి దీనిపై ఫిర్యాదు చేయడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. కమల్‌జీత్‌ కౌర్‌ స్వయాన రవీందర్‌సింగ్‌ అన్న కుమార్తె. తాజా గొడవలో ఆమె భర్తపై మున్సిపల్‌ శాఖ నుంచి కేసులు పెట్టించడం ఇక్కడి ఆధిపత్యపోరును మరో మలుపు తిప్పింది. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఆడియోలో సోహల్‌ సింగ్‌ వ్యాఖ్యలు ఉన్నాయనేది గంగుల బ్యాచ్‌ ఆరోపణ. మంత్రిని ఇరకాట పెట్టే లక్ష్యంతో చేస్తున్న పనులను గమనించి.. సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని పార్టీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే మరోదారి చూసుకుంటామని అల్టిమేటమ్‌ ఇచ్చారట.

తాజా సమస్య టీఆర్ఎస్‌ పెద్దల వరకు వెళ్లడంతో.. మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ స్పందించక తప్పలేదు. ఆడియో రగడలో తనకెలాంటి సంబంధం లేదని.. మంత్రికి తనకు మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మంత్రి గంగుల పంచన చేరితే.. మరికొందరు రవీందర్‌సింగ్‌ శిబిరానికి మద్దతు పలుకుతున్నారట. ఈ రెండు వర్గాలే మీడియా ముందుకు వచ్చి పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మరోసారి మేయర్‌ కాకపోవడానికి.. అప్పట్లో ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడానికి మంత్రి గంగులే కారణమని రవీందర్‌ సింగ్‌ వర్గం ఇప్పటికీ భావిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్‌సింగ్‌ రెబల్‌గా పోటీ చేశారు.

తాజా గొడవలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. జరిగిన ఘటనను టీఆర్ఎస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో పార్టీ పెద్దలు రెండు వర్గాలతో మాట్లాడతారని సమాచారం. అసలే క్షేత్రస్థాయిలో ఒక్క క్షణం పడని రెండు వర్గాలకు అధిష్ఠానం ఎలా సర్ది చెబుతుంది? ఏం చేస్తుంది అన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక్కడి విషయాలు హైకమాండ్‌కు తెలియంది కాదు. కాకపోతే చికిత్స ఏంటన్నదే ప్రశ్న. మరి.. కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌లో గ్రూపులకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

 

Exit mobile version