Site icon NTV Telugu

ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోందా?

ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్‌ పెట్టిందా? ఆఫీసర్ల చెక్‌లిస్ట్‌ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!?

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్‌ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్‌ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్‌. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి పీకే టీమ్‌ రంగంలోకి దిగబోతున్నట్టు స్వయంగా సీఎం జగనే కేబినెట్‌ భేటీలో చెప్పారు. ఈ రకంగా పార్టీని యాక్టివేట్‌ చేసేందుకు పక్కా ప్లాన్‌ రెడీ చేస్తోన్న ముఖ్యమంత్రి.. పరిపాలనా పరంగా కూడా అంతే పక్కాగా వెళ్లాలని డిసైడైనట్టు సమాచారం. రోజువారీ పాలనా వ్యవహారాలతోపాటు అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది..? వారికేమైనా రాజకీయ ఉద్దేశాలు.. కోరికలు.. లింకులు ఏమైనా ఉన్నాయా..? అనేదానిపై మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారట ప్రభుత్వ పెద్దలు.

ఇద్దరు ఐజీ స్థాయి అధికారులకు ప్రాధాన్యం లేదట..!

ప్రత్యేకించి ఎవరైనా IASలు.. IPSలకు ప్రతిపక్షంతో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సాన్నిహిత్యం ఉందని తెలిస్తే.. అలాంటి వారి జాబితాను రెడీ చేస్తున్నారట. ఎవరిని అనుమానించాలి? ఇంకెవరిని వాచ్‌లిస్ట్‌లో పెట్టాలనే కోణంలో ఆఫీసర్లపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ తరహా జాబితాల రూపకల్పన ఐపీఎస్‌ సర్కిల్‌లోనే ఉండేదని.. ఇప్పుడు IASల విషయంలోనూ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు ఐజీస్థాయి ఐపీఎస్‌లకు ఎలాంటి ప్రయార్టీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని గుర్తు చేసుకుంటున్నారట.

నిఘా రాడార్‌లో మరో ఇద్దరు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు?

ఇదే క్రమంలో ఇద్దరు IASలు, మరో ముగ్గురు IPSలు అనుమానితుల జాబితాలో చేరినట్టు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరి విషయంలో పక్కా ఆధారాలు దొరికే వరకు ప్రభుత్వ పెద్దలు వేచి చూడాలని అనుకుంటున్నారట. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి ఉద్యోగ వర్గాల్లో గుసగుసలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఎవరిపై ఫోకస్‌ పెట్టింది? IAS, IPSలలో ఎవరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అవి ఎలాంటి పరిచయాలు? ఇలా ఎవరికి వారు ఆరా తీసే పరిస్థితి ఉంది.

Exit mobile version