NTV Telugu Site icon

TRS : ఆ రాజకీయ నాయకుడు టీఆర్ఎస్ ను వీడేందుకే సిద్దమయ్యాడా..?

New Project (37)

New Project (37)

గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా మథన పడుతున్నారట గురునాథరెడ్డి. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని కోస్గి పట్టణానికి మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఆ కార్యక్రమానికి గురునాథరెడ్డిని ఆహ్వానించలేదట. అయినప్పటికీ బహిరంగ సభ వద్దకు వచ్చిన ఆయన్ని పాస్‌ లేదని వేదికపైకి అనుమతించలేదట పోలీసులు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన గురునాథరెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఒక్క గురునాథరెడ్డే కాకుండా ఆయన కుమారుడు కొడంగల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి సైతం పార్టీ మారబోతున్నట్టు టాక్‌.

గురునాథరెడ్డి కొడంగల్‌ నుంచి గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరి.. ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. 2018లో గురునాథరెడ్డికి కాకుండా పట్నం నరేందర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చింది పార్టీ. గురునాథరెడ్డికి ఎమ్మెల్సీ లేదా రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి ఇస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చారట. ఆ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓడిపోవడం.. పట్నం గెలవడంతో తప్పకుండా పదవి వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నారు ఈ కురువృద్ధ నాయకుడు.

ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు దక్కకపోయినా.. ఉమ్మడి పాలమూరు జిల్లా DCCB ఛైర్మన్‌ పదవి అయినా ఇస్తారని గురునాథరెడ్డి ఆశించారు. ఇందుకోసం గెలుపొందిన సింగిల్‌ విండో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్టు ఉంటున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇంతలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోనూ పెద్దాయనకు గ్యాప్‌ వచ్చిందట. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేకు ప్రాధాన్యం దక్కడం లేదని సమాచారం. దీనికితోడు పార్టీ పెద్దలు, మంత్రులు నియోజకవర్గానికి వస్తే గురునాథరెడ్డిని లైట్‌ తీసుకుంటున్నారట. ఇదే సమయంలో షర్మిల పార్టీ YSRTP గౌరవ అధ్యక్షురాలు YS విజయమ్మతో గురునాథరెడ్డి భేటీ కావడం చర్చగా మారింది. త్వరలో ఆయన పార్టీ మారిపోతారనే చర్చ ఊపందుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవానికితోడు.. వైఎస్‌ కుటుంబంతో ఉన్న పరిచయాలతో విజయమ్మని కలిసి మాట్లాడినట్టు చెబుతున్నారు.

గురునాథరెడ్డి టీఆర్ఎస్‌ను వీడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే దానిపై కొడంగల్‌లో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ లాభపడుతుందని కొందరు.. కాదని మరికొందరు లెక్కలతో కుస్తీ పడుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు సైతం గురునాథరెడ్డితో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద ఈ సీనియర్ పొలిటీషియన్‌ భవిష్యత్‌ రాజకీయంపై కొడంగల్‌లో పెద్ద చర్చే సాగుతోంది. మరి.. పెద్దాయన మనసులో ఏముందో చూడాలి.