Site icon NTV Telugu

Ponguleti Srinivasa Reddy : రాజకీయ భవిష్యత్తుపై ఆ మాజీ ఎంపీ ఆచితూచి అడుగులేస్తున్నారా..?

Pongulati Srinivas

Pongulati Srinivas

Ponguleti Srinivasa Reddy  : రాజకీయ భవిష్యతపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నారా? కేడర్‌ ఒత్తిళ్లను .. చాలా కూల్‌గా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా పొంగులేటి వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయా? పరిస్థితిని అంచనా వేద్దామంటే.. అర్థమేంటి? లెట్స్‌ వాచ్‌..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న పొలిటికల్‌ లీడర్‌ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన రాజకీయ భవిష్యత్‌పైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? అధికార పార్టీలో ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవా ? అయితే ఏ పార్టీని సేఫ్‌ ప్లేస్‌గా భావిస్తున్నారు? అని ఆరా తీస్తున్నారట. గత ఏడాది పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగితే.. ఇటీవల బీజేపీలోకి వెళ్తారని చర్చ నడిచింది. అధికార పార్టీ వర్గాలు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లోనే ఉంటారని చెబుతున్నాయి.

దశాబ్దం క్రితం రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పట్టు సాధించారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి.. అక్కడే కొనసాగుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదు. మనసులో అసంతృప్తి ఉన్నా.. అది బయట పడకుండా.. అనుచరులు నీరసించకుండా.. వేయని ఎత్తుగడలు లేవంటారు. ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి జనాల్లో ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు పొంగులేటి. చేతిలో ఏ పదవీ లేకపోయినా అధికారపార్టీ నాయకుడిగా జిల్లాను చుట్టేస్తున్నారు. అయితే పొంగులేటి తమవైపు రాకపోతారా అని కాంగ్రెస్‌, బీజేపీలు కాచుకుని ఉన్నాయి.

పార్టీ మార్పుపై అనుచరుల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒత్తిడి ఉందట. ఇటీవల కుమార్తె పెళ్లి రిసెప్షన్‌ను అట్టహాసంగా నిర్వహించారు. అది కాగానే పార్టీ మారిపోతారని అనుకున్నారట. కానీ.. అనుచరుల మూడు పసిగట్టిన పొంగులేటి.. వాళ్లకు.. పార్టీ మారిపోతారని అభిప్రాయపడుతున్న వాళ్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ మార్పుపై ఎవరూ ఒత్తిడి తేవొద్దు. దేవుడు ఉన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. దారి చూపించేది కూడా దేవుడే అని పొంగులేటి చెప్పడంతో అనుచరులు కంగుతిన్నారట. మనకు మంచిరోజులు వస్తాయని.. తొందరపడితే బొక్క బోర్లా పడతామని గుర్తుంచుకోవాలని మాజీ ఎంపీ హెచ్చరించడంతో.. కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. పొంగులేటికి పార్టీ మారే ఉద్దేశం లేనందునే ఆ కామెంట్స్‌ చేశారని భావిస్తున్నారట. అయితే సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారనే వాళ్లూ లేకపోలేదు.

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఫీవర్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కూడా పొంగులేటి ఉండొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఆధారంగా ఆయన అడుగులు వేయొచ్చని.. అదే విషయంపై అనుచరులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని జిల్లాలో విశ్లేషణలు మొదలయ్యాయి. కాకపోతే గతానికంటే భిన్నంగా మాజీ ఎంపీ స్పందించడం.. కూల్‌గా సమాధానం చెప్పడం చూశాక.. రాజకీయ భవిష్యత్‌పై పొంగులేటి పక్కా క్లారిటీతో ఉన్నారని పొలిటికల్‌ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. మరి.. మాజీ ఎంపీ ఏం చేస్తారో చూడాలి.

 

Exit mobile version