NTV Telugu Site icon

TRS : ఉప్పు నిప్పులా ఉన్న నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా.? ఇంతకీ ఎవరా నేతలు.?

New Project (70)

New Project (70)

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్‌లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి విషమించేది కాదనేది కేడర్‌ మాట. ప్రస్తుతం ఉప్పు-నిప్పులా ఉన్న జూపల్లి, బీరం మద్య సయోధ్య అంత ఈజీ కాదని అనుకుంటున్నారట.

కొల్లపూర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే ఉన్న జూపల్లి కృష్ణారావు ఆ కార్యక్రమాలకు రాలేదు. ఆ ప్రొగ్రామ్స్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన ఎమ్మెల్యే బీరం మాజీ మంత్రిని పిలవలేదని ఒక వాదన. ఇంతలో మంత్రి కేటీఆర్‌.. జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం కొల్లాపూర్‌ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. జూపల్లి పార్టీ మారిపోతారని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయనతో కేటీఆర్‌ భేటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. కేటీఆర్‌ తన ఇంటికి వచ్చిన సమయంలో అనుచరగణాన్ని పెద్ద ఎత్తున పోగేసి.. తన బలం తగ్గలేదని నిరూపించుకొనే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. రహస్య భేటీలో చర్చించిన అంశాలేమైనప్పటికీ.. సర్వేల్లో తమకే అనుకూలంగా ఉన్నట్టు.. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని.. టీఆర్‌ఎస్‌ మీ పట్ల సానుకూలంగా ఉందని KTR ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో రానున్న ఎన్నికల్లో టికెట్‌ తమకే అని ధీమాతో ఉంది జూపల్లి వర్గం.

కేటీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాసగౌడ్‌, నిరంజన్‌రెడ్డిలు జూపల్లి ఇంటికి వెళ్లగా.. ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. తాజా పరిణామాలు.. జూపల్లితో భేటీపై బీరం వర్గం అసంతృప్తితో ఉంది. పైగా మాజీ మంత్రి వర్గం సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారం ఎమ్మెల్యే శిబిరానికి మింగుడుపడటం లేదట. మీడియా ముందుకు వచ్చిన బీరం తనదైన శైలిలో చిర్రుబుర్రులాడారు. ఇదంతా చూసిన వారికి.. కొల్లాపూర్‌ టీఆర్ఎస్‌లో నేతల మధ్య సయోధ్య సాధ్యమా అనే ప్రశ్నలు వేస్తున్నారట. ఒకవేళ సయోధ్య కుదిర్చితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి అనేది పెద్ద ప్రశ్న. ఆ అంశంపై క్లారిటీ ఇవ్వకపోతే రెండు శిబిరాలు మరింత కాలుదువ్వే ప్రమాదం ఉందని కేడర్‌ ఆందోళన చెందుతోందట. మరి.. రానున్న రోజుల్లో కొల్లాపూర్‌ కొత్త లెక్కలు ఏం చెబుతాయో చూడాలి.