Site icon NTV Telugu

Y. S. Sharmila : ప్రివిలేజ్ కమిటీ పిలిస్తే…వైఎస్ షర్మిల వస్తారా..?

Ys Sharmila

Ys Sharmila

YSRTP చీఫ్‌ షర్మిల.. టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధుల మధ్య రేగిన రగడలో కీలక మలుపులు ఉంటాయా? ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు షర్మిల హాజరు కావాల్సి వస్తుందా? పొలిటికల్‌ సర్కిల్‌ చర్చల్లో ఉన్న అంశాలేంటి? లెట్స్‌ వాచ్‌..!

పాదయాత్రలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల చేస్తున్న కామెంట్స్‌పై పలువురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హక్కులకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఏకంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు. షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పందించిన సభాపతి.. పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి దృష్టీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ కదలికలపై నెలకొంది.

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు పిటిషన్లు రావడం.. చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఇప్పుడు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశిస్తే.. కమిటీ ఏం చేస్తుందన్నది ప్రశ్న. ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌ ఉన్నారు. కమిటీలో అధికార పార్టీకి ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తాటికొండ రాజయ్య, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, MIM ఎమ్మెల్యేతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభ్యులుగా ఉన్నారు. సభాపతి నుంచి ఆదేశాలు వెళ్తే కమిటీ సమావేశంకాక తప్పదు.

శాసన సభ్యులు ఇచ్చిన పిటిషన్‌లోని అంశాలను పరిశీలించి.. కమిటీ షర్మిల వివరణ కోరే అవకాశం ఉంటుంది. షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిందని కమిటీ భావిస్తే.. ఆ విషయాన్ని స్పీకర్‌ పోచారం దృష్టికి తీసుకెళ్తుంది. కమిటీ రిపోర్ట్‌తో సభాపతి ఏకీభవిస్తే చర్యలకు ఆస్కారం కలుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రగడపై షర్మిల కూడా స్పందించారు. అటు నుంచి యాక్షన్‌ మొదలైతే.. తనవైపు నుంచి రియాక్షన్‌ ఉంటుందని ఆమె చెప్పారు. న్యాయపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు కూడా. అయితే గతంలో అధికారపార్టీ నేతలు తనపై చేసిన కొన్ని కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ.. వాటికి సమాధానం ఏంటని ప్రశ్నిస్తున్నారు షర్మిల.

రెండు పక్షాలు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో రేపటి రోజున ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలపై షర్మిల చేసిన కామెంట్స్‌ ఏంటా అని కొందరు ఆరా తీస్తుంటే.. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై తదుపరి కార్యాచరణ ఏంటా అని మరికొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి.. రానున్న రోజుల్లో ఈ సమస్యలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

 

Exit mobile version