NTV Telugu Site icon

Erra Shekhar : ఆ నాయకుడి చేరికతో పార్టీ దిక్కు తోచని స్థితిలో పడిందా..?

Tcongress

Tcongress

ఎర్ర శేఖర్‌. టీడీపీ నుంచి బీజేపీలోకి అటు నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే. కొన్నాళ్లుగా ఎర్ర శేఖర్‌ చేరికపై పార్టీలో చర్చ జరుగుతున్నా.. ఈ మధ్య ఆటంకాలు అధిగమించి.. పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఇప్పటికే మాజీ ఎంపీ మల్లు రవి.. యువ నేత అనిరుధ్‌రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్‌ రాజకీయాలను రక్తికట్టిస్తుంటే.. ఇప్పుడు కొత్తగ ఎర్ర శేఖర్‌ ఎంట్రీతో రాజకీయం ఇంకా రసవత్తరంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎవరికి టికెట్‌ ఇస్తుందో కానీ.. నేతల శిబిరాల్లో మాత్రం కదలికలు పెరిగాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిన మల్లు రవి.. మరోసారి అక్కడి నుంచే పోటి చేసే ఆలోచనలో ఉంటే.. కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీసులతో జడ్చర్ల అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు అనిరుధ్‌రెడ్డి. ఒకానొక దశలో కోమటిరెడ్డి సహకారంతో ఎర్ర శేఖర్‌ ఎంట్రీని అడ్డుకున్నారు అనిరుధ్‌రెడ్డి. కానీ.. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ గూటికి వచ్చేశారు. సమస్యను ఓ సవాల్‌గా తీసుకున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ వెళ్లి ఎర్ర శేఖర్‌ చేరికకు లైన్‌ క్లియర్‌ చేసుకొచ్చారని టాక్‌. ఈ కారణంతో ఎర్ర శేఖర్‌ పీసీసీ చీఫ్‌కు సన్నిహితం అయ్యారు.

నల్లగొండ జిల్లాలో జోక్యం చేసుకోకుండా కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ కుతకుత లాడుతున్నారు. పైగా తన సొంతజిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో చేరికలను సైతం ఆయన అడ్డుకోవడాన్ని పీసీసీ చీఫ్‌ ప్రెస్టీజీగా తీసుకున్నారట. జడ్చర్లలో కోమటిరెడ్డి వర్గానికి చెక్‌ పెట్టేందుకే పీసీసీ చీఫ్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు భావిస్తున్నారు. ఎర్ర శేఖర్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేయడం.. బీసీ నేత కావడంతో అక్కడ పాగా వేయడం పెద్ద కష్టం కాదనే లెక్కల్లో ఉన్నారట రేవంత్‌. ఆ వివరాలు ఢిల్లీ పెద్దలకు చెప్పే చకచకా పావులు కదిపినట్టు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్‌ కండువా కప్పుకోగానే.. జడ్చర్లలో దూకుడు పెంచారు ఎర్ర శేఖర్‌. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన అనుచర వర్గాన్ని పలకరిస్తూనే.. గతంలో తన వెన్నంటి ఉండి.. ఇప్పుడు ఇతర పార్టీలలో కొనసాగుతున్న వారితోనూ టచ్‌లోకి వెళ్తున్నారట. తన సామాజికవర్గ ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. పనిలో పనిగా.. పాత కాంగ్రెస్‌ కాపులు.. మల్లు రవి అనుచరులు, రేవంత్‌ వర్గం కూడా ఎర్ర శేఖర్‌కు కనెక్ట్‌ అవుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ తనకే జడ్చర్ల టికెట్‌ అని భావించిన అనిరుధ్‌రెడ్డికి తాజా పరిణామాలు రుచించడం లేదట. ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ జడ్చర్ల కాంగ్రెస్‌ రాజకీయం మరింత రంజుగా మారుతుందని ప్రచారం జరుగుతోంది.