Site icon NTV Telugu

Tamilisai Soundararajan : తెలంగాణ రాజకీయ పరిస్థితి పై కేంద్రానికి తమిళిసై రిపోర్ట్ ఇచ్చారా..?

Tamil Sai

Tamil Sai

Tamilisai Soundararajan : తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై రిపోర్ట్‌ ఇచ్చారా? ఆ నివేదికలో ఉన్న అంశాలేంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగా ఉన్న సమయంలో ఈ అంశం కాక రేపుతోందా? గవర్నర్‌ నివేదికపై పార్టీలు ఆరాలు తీస్తున్నాయా? లెట్స్‌ వాచ్‌..!

మునుగోడు ఉపఎన్నిక.. బండి సంజయ్‌ పాదయాత్ర అడ్డగింత.. బీజేపీ-టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ.. పాతబస్తీలో టెన్షన్‌ వాతావరణం.. లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనల మధ్య గవర్నర్‌ తమిళిసై న్యూఢిల్లీ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు గవర్నర్‌. దాదాపు అరగంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ఓ ప్రత్యేక నివేదికను అమిత్ షాకు అందించారు తమిళిసై. రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో ఇచ్చిన రిపోర్ట్ కావడంతో.. తమిళిసై కేంద్రానికి ఏం చెప్పారు? నివేదికలో పొందుపర్చిన అంశాలేంటి అనేది ఉత్కంఠగా మారింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై గట్టిగా ఫోకస్‌ పెట్టింది. దాంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికిప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన ఇంటి దగ్గర విడిచిపెట్టారు పోలీసులు. ఇదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల రగడలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. తాజా రాజకీయ పరిణామాలు.. రాజాసింగ్‌ సస్పెండ్ తర్వాత పాతబస్తీలో జరుగుతున్న ఘటనలు.. గవర్నర్‌ తన నివేదికలో పొంది పరిచి ఉంటారని పొలిటికల్‌ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.

ఇటీవల తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సంజయ్‌ పాదయాత్రలో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. వీటిని కూడా నివేదికలో ప్రస్తావించి ఉంటారని అభిప్రాయపడుతున్నారట. దీనికితోడు రాష్ట్రంలో గవర్నర్‌కు ప్రొటోకాల్‌ దక్కడం లేదనే అంశాన్నీ రిపోర్ట్‌లో నివేదించి ఉంటారని భావిస్తున్నారు. కొంతకాలంగా బాసర ట్రిపుల్‌ ఐటీలో జరుగుతున్న సంఘటనలను విశదీకరించి ఉంటారని మరికొందరి వాదన.

వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వివిధ నిఘా వర్గాల నుంచి కేంద్రానికి నివేదికలు అందుతుంటాయి. వాటిని గవర్నర్‌ ఇచ్చిన రిపోర్ట్‌తో బేరీజు వేసుకుంటారని.. అందుకు తగ్గటుగా కేంద్ర ప్రభుత్వ వ్యూహరచన ఉంటుందని రాజకీయ విశ్లేషణలు నడుస్తున్నాయి. అందుకే కీలక సమయంలో గవర్నర్‌ ఢిల్లీ పర్యటన.. కేంద్రానికి అందజేసిన నివేదిక పొలిటికల్‌ సర్కిళ్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

Exit mobile version