NTV Telugu Site icon

అవినీతిలో గుంటూరు రవాణా అధికారుల తీరే వేరా?

ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్‌ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్‌కమ్‌కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో సొంత ఒప్పందాలు?

అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ ప్రచారాలను బలపరిచేలా ఉంటాయి. సెంటీమీటర్‌ సంధు ఇస్తే.. కిలోమీటర్‌ దూసుకెళ్లే ఘనులు ఉన్న డిపార్ట్‌మెంట్‌. అక్కడ పనోళ్లకు కొదవేం లేదు. ఆ విధంగా గుంటూరు రవాణా అధికారులు చర్చల్లోకి వచ్చారు. కరోనాతో దెబ్బతిన్న సొంత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు ఏకంగా ట్రావెల్‌ ఏజెంట్లు.. వెహికల్‌ యజమాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవినీతి అధికారులు చెప్పినదానికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఖుషీ!

ప్యాసింజర్‌ క్యారియర్‌గా తిరిగేందుకు ఏ వాహనాన్నైనా వాడుకోండి.. తమకు ఇచ్చేది ఇస్తే చాలు అని చెప్పి డీల్‌ చేసుకున్నారట. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఎగిరి గెంతేశారట. వాస్తవానికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో వాహనాలు తిప్పాలంటే ఆ వెహికల్స్‌కు తప్పనిసరిగా యల్లో నెంబర్‌ ప్లేట్స్‌ ఉండాలి. వాటికి ట్యాక్స్‌ ఎక్కువ పడుతుంది. మూడు నెలలకోసారి రోడ్‌ ట్యాక్స్‌ కట్టాలి. బోర్డర్‌ పన్నులు.. ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు సరేసరి. వచ్చే ఆదాయంలో వాహన యజమానులకు మిగిలేది తక్కువ. దీంతో రవాణా అధికారులు చెప్పిన డీల్‌కు ఓకే చెప్పేశారట ప్రైవేట్‌ ట్రావెల్స్ యజమానులు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఒక్కో వాహనానికి రూ.5 వేలు వసూలు!
అవినీతి అధికారులు ఇచ్చిన హామీతో రోడ్డెక్కిన 50 వేల వాహనాలు?

ఇటీవల ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలకు ఏడాదికి 24 వేలు కడితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఉపయోగించుకునే వీలు కల్పించింది. దీంతో ఈ వెసులుబాటును అనుకూలంగా మలుచుకున్నారట అవినీతి అధికారులు. ఒక్కో వెహికల్‌కు ఏడాదికి 5 వేల చొప్పున ఇస్తే.. ఏదైనా చేసుకోవచ్చని.. తాము పట్టుకోబోమని సెలవిచ్చారట. ఆ మాట వినగానే ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ వాహనాలను పక్కన పెట్టి.. వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలు రోడ్డెక్కించేశారు టావెల్స్‌ యజమానులు. ఈ విధంగా ఒక్క గుంటూరు పరిధిలోనే 50 వేల వాహనాలు రయ్‌మని రోడ్లపై పాసింజర్‌ కారియర్లుగా దూసుకెళ్తున్నాయి. కరోనా వల్ల ఆదాయానికి గండిపడి విలవిల్లాడుతున్న అధికారులు.. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఈ విధంగా వాడేసుకున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి.. సొంత ఖాజానా నింపుకొనేందుకు పోటీ!

నిజానికి కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దాని నుంచి బయట పడేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు పాలకులు. కానీ.. వాటికీ చిల్లుపెట్టి సొంత జేబులు నింపుకొంటున్నారు అవినీతి ఘనులు. క్రషర్‌లకు వెళ్తున్న లారీల నుంచి కూడా స్పెషల్‌ కరోనా ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారట. మొత్తానికి తమ అవినీతికి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అక్రమార్కులను చూసి ఇతర ప్రభుత్వ విభాగాల వాళ్లు నోళ్లెళ్ల బెడుతున్నారట.