Site icon NTV Telugu

Mancherial District Congress : చేరికతో అక్కడి కాంగ్రెస్ లో చిచ్చుపెట్టాయా..? నేతల రాక కాకరేపుతోందా..?

Manchiryala Congress

Manchiryala Congress

Mancherial District Congress : చేరికలు చెన్నూర్‌ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టాయా? కొత్త నేతల రాక కాక రేపుతోందా? ముచ్చటగా మూడు గ్రూపులు కట్టారా? అంతర్యుద్ధంతో అంత హస్తవ్యస్తం అవుతోందా? ముఠాలు.. కుంపట్లతో నిప్పు పెడుతోంది ఎవరు? లెట్స్‌ వాచ్‌..!

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో కలహాలు పార్టీ వర్గాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నూర్‌లో మూడు గ్రూపులు రచ్చ రచ్చ చేసి పెడుతున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ప్రభావం ఎక్కువ. ఆయన అనుచరుడిగా .. అనధికారి ఇంఛార్జ్‌ హోదాలో పార్టీ నేత రమేష్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్‌ల నుంచి వచ్చిన నేతలతో కాంగ్రెస్‌ ఎంత బలపడిందో ఏమో.. మూడు గ్రూపులైతే పుట్టుకొచ్చాయి. బీజేపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌ది ఒక వర్గమైతే.. టీఆర్ఎస్‌ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుది మరో వర్గం. ఇక్కడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఎదుర్కోవడానికి ఈ చేరికలు ఉపయోగ పడతాయని కాంగ్రెస్‌ పెద్దలు ఆలోచిస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిణామాలు మరోలా ఉన్నాయట.

మాజీ ఎమ్మెల్యే ఓదెలుతోపాటు.. ఆయన భార్య జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. వీరిద్దరినీ పీసీసీ చీఫ్‌ రేవంతరెడ్డే ఢిల్లీ తీసుకెల్లి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్పించారు. అయితే ప్రేమ్‌సాగర్‌ వర్గం ఓదెలు, జనార్దన్‌ వర్గాలను లైట్‌ తీసుకుంటోందట. దీంతో ఎవరికి వారుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంగా కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. AICC కార్యదర్శి రోహిత్ చౌదరి వచ్చారు. ఆయన సమక్షంలోనే ఓదెలు తిరుగుబాటు ప్రకటించినంత పనిచేశారు. ప్రేమ్‌ సాగర్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖ తనను అవమానిస్తున్నారని ఆరోపించారు ఓదెలు. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. చెన్నూర్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కలిసి వచ్చే విధంగా ప్రేమ్‌సాగర్‌రావు వర్గం తీరు ఉందని ఆయన ఆరోపించారు.

ఓదెలు చేసిన ఆరోపణలపై జిల్లా పార్టీ చీఫ్‌ సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఏకంగా AICC కార్యదర్శి సమక్షంలోనే వర్గపోరు బుసలు కొట్టడంతో పార్టీ వర్గాల్లో చర్చగా మారిపోయింది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసమే అన్నది పార్టీ వర్గాల వాదన. ఎవరికి వారు బలప్రదర్శనకు.. బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎవరికి ఛాన్స్‌ ఇస్తుందో ఏమో .. ముఠా తగాదాలతో చెన్నూర్‌లో పార్టీ బలహీన పడుతోందన్నది నేతలు చెప్పేమాట. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి స్పష్టమైన హామీ ఇచ్చి ఉంటే బాగుండేదని.. అందరితో సయోధ్య కుదిర్చితే గొడవలు వచ్చేవి కాదని అభిప్రాయ పడుతున్నారట. చెన్నూర్‌ సమస్యను పరిష్కరించేందుకు పీసీసీ పెద్దలు చొరవ తీసుకుంటారా లేక.. ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తాయా అనే చర్చ సాగుతోందట. మరి.. గ్రూపు తగాదాలకు చెక్‌ పెట్టేందుకు ఏం చేస్తారో చూడాలి.

Exit mobile version