NTV Telugu Site icon

ప్రభుత్వ వైద్యుల రచ్చరచ్చ..యూనియన్ పాలిటిక్స్ తో డాక్టర్స్ వార్

Doctors

Doctors

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. అందులో ప్రభుత్వ డాక్టర్ల సంఘాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు తమ దృష్టంతా రాజకీయాలపై పెడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ఏర్పాటైన సంఘం పేరును వాడుకునే విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. పోలీసు కేసులు.. కోర్టులో విచారణ వరకు వెళ్లింది సమస్య. పైగా ఒకరిపై మరొకరు పదేపదే ఫిర్యాదులు చేసుకుంటూ శాఖాధిపతులకు కొరకరాని కొయ్యగా మారారు వైద్యులు.

డ్యూటీలపై ఫోకస్ పెట్టకుండా యూనియన్లను బలోపేతం చేయడానికే దృష్టి పెడుతున్నారట ప్రభుత్వ వైద్యులు. రాజకీయ పార్టీల తరహాలోనే కొందరు పాలిటిక్స్‌ చేస్తున్నారట. సోషల్ మీడియాల్లో చర్చలు, సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని యూనియన్లు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి హరీష్‌రావు సూచించినా.. ఆ దిశగా అడుగులు పడడం లేదట. వైద్యుల సంఘాలతోనే సమస్య ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారట. ప్రభుత్వ విధానాలపై సంఘాలు చేస్తున్న ప్రకటనలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయట. ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక సంఘం అంగీకరిస్తుండగా, మరొక సంఘం వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇటీవల కాలంలో సర్కార్‌ గట్టిగానే ఫోకస్‌ పెట్టిందట.

వాస్తవానికి యూనియన్ల పేరుతో ఎవరి అవసరాలు వాళ్లు తీర్చుకుంటున్నారట కొందరు డాక్టర్లు. ఇదేదో లాభసాటిగా ఉందని భావించిన మరికొందరు ప్రభుత్వ డాక్టర్లు కూడా వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో రోడ్డెక్కుతున్నారు. నలుగురు ప్రభుత్వ డాక్టర్లు కలిస్తే.. ఒక యూనియన్‌ ఏర్పాటు చేసేస్తున్నారు. నీకు ఇది.. నాకు అది అని వాటాలు వేసేసుకుని రాజకీయ నేతలను కలవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారానికో.. నెలకో ప్రభుత్వ వైద్యుల సంఘం పుట్టుకు రావడం కామనైపోయింది. ఇవాళ ఒక యూనియన్‌లో ఉన్నవారు.. రేపు సొంతంగా సంఘం పెడతారో.. మరో వర్గంతో కలిసి కనిపిస్తారో ఊహించడం కష్టంగా ఉంది.

గంటల కొద్ది ఫోన్లలో ఛాటింగ్‌లకు సమయం కేటాయిస్తున్న వైద్య సంఘాల మేధావులు.. ఒక గంట కూడా ఓపీలో ఉండటం లేదట. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే.. తమ హక్కులు.. ఆదేశ సూత్రాలను వల్లెవేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వీటికి మంత్రి హరీష్‌రావు చెక్‌ పెడతారో లేదో చూడాలి.