Site icon NTV Telugu

మాజీ ఎమ్మెల్యే అనిల్ కు కొత్త పదవి..వైరివర్గం అటాక్

Pattu Nelichena

Pattu Nelichena

రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక మార్పులకు PCC కార్యాచరణ సిద్ధం చేస్తుందని టాక్‌. అందులో ముఖ్యమైంది జిల్లాలకు కొత్త కాంగ్రెస్‌ సారథుల నియామకం. పార్టీలో సీనియర్‌ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలను డీసీసీలుగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇదే చేసింది. ఆ ఫార్ములానే కాంగ్రెస్‌ కూడా ఫాలో అవుతుందనేది టాక్‌. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ పేరు చర్చల్లో ఉంది. ఇప్పటి వరకు డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న మానాల మోహన్‌రెడ్డిని పీసీసీ కమిటీలోకి తీసుకుంటారని.. అనిల్‌కు జిల్లా పగ్గాలు అప్పగిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే అనిల్‌ పేరు చర్చల్లోకి వచ్చాక పార్టీలో మరో టాక్‌ మొదలైందట. దానిపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

అనిల్‌ తొలుత ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక విప్‌ పదవి పొందారు. తర్వాత 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఓడిన అనిల్‌కు పార్టీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆయన వ్యతిరేకవర్గం అప్పుడే ప్రశ్నలు సంధిస్తోంది. పైగా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు ఎవరో.. కార్యకర్తలు ఎవరెవరో ఆయనకు తెలియదని.. అలాంటి నాయకుడికి పగ్గాలు ఇస్తే నెగ్గుకు రాగలమా అని నిలదీస్తున్నారట. నియోజకవర్గంలో నేతలకు, కార్యకర్తలకు అనిల్‌ అందుబాటులో ఉండబోరన్నది ప్రధాన ఆరోపణ.

అసలు ఎన్నిరోజులు నియోజకవర్గంలో అనిల్‌ అందుబాటులో ఉంటున్నారో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆరా తీయాలని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారట. స్థానికంగా పసుపు రైతులు ఉద్యమిస్తే.. వారికి సంఘీభావంగా ఏనాడూ ముందుకు రాలేదని సీనియర్‌ నాయకులే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. సొంత నియోజకవర్గమే పట్టని నాయకుడికి జిల్లా పగ్గాలు అప్పగిస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదని పార్టీ పెద్దల చెవిలో వేశారట. ఇంట గెలిచి.. రచ్చ గెలిచిన వాళ్లకే జిల్లా కాంగ్రెస్‌ సారథ్యం అప్పగించాలన్న డిమాండ్‌ పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. అయితే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. కొత్త డీసీసీ ప్రెసిడెంట్‌ పేరు ప్రకటించకుండానే అనిల్‌ వైరి వర్గం పావులు కదపడం చర్చగా మారింది. ఇప్పటి నుంచే అడ్డుకోకపోతే తర్వాత ఏం చేయలేమనే ఆలోచనతో కొందరు సీనియర్‌ నాయకులు తెరవెనక పెద్ద ఎత్తుగడే వేశారట. మొత్తానికి మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక గ్రూప్‌ బయటకు రావడం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌ అయ్యింది.

WAtch Here : https://youtu.be/2DCxsk-ozDs

Exit mobile version