గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పత్త లేకుండా పోయారు ఆ మాజీ ఐఏఎస్. ఇప్పుడు సడెన్‌గా టీడీపీలో పెద్ద పదవితో తళుక్కుమన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీటుకు ఎసరు పెడతారా? అయితే తమ సంగతి ఏంటి? ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్నలివే. ఇంతకీ ఎవరా మాజీ ఐఏఎస్? ఏంటా నియోజకవర్గం?
మళ్లీ కోడుమూరు బరిలో దిగుతారా?
రామాంజనేయులు. మాజీ ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్. రిటైరైనా సర్వీస్‌ను పొడిగించడంతో 2019 ఎన్నికల ముందు వరకు విధుల్లో కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి టీడీపీలో చేరిపోయారు ఈ అధికారి. కండువా కప్పుకొని.. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యేగా బరిలో దిగి ఓడిపోయారు. ఆ ఓటమి కుంగదీసిందో ఏమో.. కర్నూలు జిల్లాతోపాటు కోడుమూరులో టీడీపీ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించలేదు. రెండేన్నరేళ్ల తర్వాత ఇప్పుడు సడెన్‌గా టీడీపీ మానవ వనరుల అభివృద్ధి విభాగం ఇంఛార్జ్‌గా.. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రీఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కోడుమూరులో పోటీ చేస్తారా లేక పార్టీ పనులకే పరిమితం అవుతారా అని లోకల్ లీడర్స్ ఉత్కంఠగా చర్చించుకుంటున్నారట.
2019లో కేడర్ సహకరించలేదట..!
రామాంజనేయులు ఆలూరు నియోజకవర్గానికి చెందిన వారు. గతంలో ఆలూరు నుంచి తన భార్యను పోటీ చేయించేందుకు ప్రయత్నించారట. వీలుకాకపోవడంతో 2019లో ఆయనే ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్‌లతో ఉన్న సన్నిహిత సంబంధాలతో కోడుమూరు టికెట్ తెచ్చుకోవడంతో ఆ ఎన్నికల్లో లోకల్ కేడర్‌కు రుచించ లేదట. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, టికెట్ ఆశించిన ఆకుపోగు ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, జడ్పీ మాజీ చైర్మన్ ఆకుపోగు వెంకటస్వామి అసంతృప్తితో రగిలిపోయినట్టు చెబుతారు. ఇదే విషయంపై నాలుగు గోడల మధ్య పలుసార్లు రామాంజనేయులను నిలదీసినట్టు సమాచారం. అప్పటికి కొన్ని నెలల ముందు టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఏమీ చెప్పలేకపోయారట. దాంతో ఆ ఎన్నికల్లో కోడుమూరు టీడీపీ కేడర్ బయటికి కనిపించేలా ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో సహకరించలేదట. వెరసి మాజీ ఐఏఎస్‌కు ఓటమి తప్పలేదు.
పార్టీ పదవి ఇచ్చారు కానీ.. ఇంఛార్జ్‌ను చేయలేదని కొందరి వాదన..!
ఇప్పుడు టీడీపీలో రాష్ట్రాస్థాయి పదవి పట్టిన రామాంజనేయులు.. మళ్లీ కోడుమూరు వస్తే పరిస్థితి ఏంటి? జెండాలు మోసి అలసిపోవాల్సిందేనా అని కేడర్ ప్రశ్నించుకుంటోందట. అదే జరిగితే మళ్లీ సొంతవాళ్లే ఓడిస్తారని ఓపెన్‌గానే చెప్పుకొంటున్నారట. అయితే రామాంజనేయులును ఎక్కడా ఇంచార్జ్‌గా నియమించలేదు. ఆయన్ని ఎన్నికల బరిలో దించకుండా పార్టీ సేవలకు వినియోగించుకుంటారనే వాదన ఉందట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
