Site icon NTV Telugu

టీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా దుబారా ఖర్చులు..!

మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గడం లేదు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన సారథులు, ఉన్నతాధికారులు.. లగ్జరీ కార్ల కోసం ఆర్టీసీపై మరింత భారం వేస్తున్నారు. విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నారు.

లక్షలు ఖర్చుపెట్టి సారథుల కోసం కొత్త కార్లు?

ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి.. ప్రభుత్వం, ప్రజా రోడ్డు రవాణా సంస్థ చేసే విన్నపాలు ఇవి. తెర తీసి చూస్తే.. టీఎస్‌ ఆర్టీసీలో మరో దృశ్యం కనిపిస్తుంది. ఒక్కో రూపాయి రెవెన్యూ కోసం.. ఆర్టీసీ కార్మికులు పగలు రాత్రి కష్టపడుతుంటే ఏసీ రూముల్లో కూర్చొనే అధికారుల విలాసాలకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచేందుకు కార్మికులు ఎంత కష్టపడుతున్నారో జనాలు చూస్తున్నారు. సలహాలు ఇచ్చే అధికారుల తీరే శ్రమటోడ్చే కార్మికులకు మింగుడు పడటం లేదట. గడిచిన రెండేళ్లుగా ప్రతినెలా మొదటి వారంలో జీతం తీసుకోవడం గగనంగా ఉంటే.. దుబారా ఖర్చులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సంస్థను నడిపించే సారథలు కోసం లక్షలు వెచ్చించి కొత్త కార్లు కొనుగోలు చేస్తున్నారట. అదే ఇప్పుడు చర్చగా మారింది.

ఛైర్మన్‌ బాజిరెడ్డి కోసం రూ.37 లక్షలతో కొత్త కారు..!

చాలా కాలం తర్వాత ఆర్టీసీకి ఛైర్మన్‌ వచ్చారు. పూర్తిస్థాయి ఎండీ కొలువుదీరారు. ఆర్టీసీ పూర్వ ఛైర్మన్‌ వాడిన కారుల్లో ఒకదానితో ఎండీ సజ్జనార్‌ సరిపెట్టుకుంటే.. ప్రస్తుత ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌కు మాత్రం 37 లక్షలతో కొత్త కారు కొనుగోలు చేసింది ఆర్టీసీ. 2017-18లో నాటి ఛైర్మన్‌ కోసం 28 లక్షలతో కొనుగోలు చేసిన ఇన్నోవా కారు.. ఆయన పదవీకాలం ముగిశాక షెడ్డులో పెట్టారు. ఆ కారుకు పెద్దగా మరమ్మతులు అవసరం లేదని చెబుతున్నారు. కానీ.. బాజిరెడ్డి గోవర్దన్‌ ఆ కారు వద్దు అని చెప్పారట. మాజీ ఛైర్మన్‌ వాడి వదిలేసిన ఇన్నోవా నాకేందుకు.. కొత్త కారు కావాలని కోరడంతో.. బాజిరెడ్డి కోసం 37 లక్షలతో కియా కార్నివాల్‌ కారు కొనుగోలు చేసింది ఆర్టీసీ.

మంత్రి అజేయ్‌కు కూడా కొత్త కారు?

ఇప్పుడీ కొత్తకార్ల జాబితాలో రవాణా మంత్రి పువ్వాడ అజేయ్‌ కూడా ఉన్నారట. ఆయనకు కూడా కొత్త కారు కొనుగోలు చేయడానికి ఆర్టీసీ సిద్ధమైనట్టు సమాచారం. ఛైర్మన్‌కు కొత్త కారు ఇచ్చినప్పుడు.. మంత్రినైన తనకు ఆర్టీసీ నుంచి కారు లేకపోతే బాగోదని అనుకున్నారో ఏమో..ఓ రేంజ్‌లో ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. మంత్రి విషయంలో ఇక్కడే తిరకాసు ఉంది. మంత్రి అజేయ్‌కు ప్రభుత్వం ఫార్చ్యూనర్‌ కారు.. కాన్వాయ్‌ సమకూర్చింది. ఆ వాహనశ్రేణి ఉండగా.. ఆర్టీసీపై కొత్తగా భారం ఏంటన్నదే ప్రశ్న. ప్రభుత్వం ఇవ్వకపోతే.. రవాణ మంత్రి కాబట్టి.. ఆర్టీసీ నుంచి కొనుగోలు చేశారని అనుకోవచ్చు. కానీ.. మంత్రిగారి డబుల్‌ కారు ఫిట్టింగే ఆర్టీసీ వర్గాలకు అర్థం కావడం లేదట. కష్టకాలంలో ఇదేం పనిసార్‌ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. కొన్ని అవసరాలు తప్పదు కదా అన్నది ఆర్టీసీ నుంచి వినిపించే మాట.

ఉన్నతాధికారుల కోసం కూడా కొత్త కార్లు?
నీతులు ఎదుటివాళ్లకేనా?

ఈ ఎపిసోడ్‌లో ఇంకో కొసమెరుపు కూడా ఉంది. కేవలం ఆర్టీసీ ఛైర్మన్‌ గోవర్దన్‌, మంత్రి పువ్వాడ అజేయ్‌లకే కాదు.. సంస్థలోని కొంతమంది ఉన్నతాధికారుల కోసం కూడా సరికొత్తగా కార్లు కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొటేషన్లను కోరినట్టు సమాచారం. ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని బస్‌భవన్‌లోని HODలకు సర్క్యులర్‌ జారీ చేశారు. అవసరాలను తగ్గించుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించిన ఉన్నతాధికారులు ఈ విధంగా దుబారాలకు వెళ్లడమే ఆశ్చర్యం. నీతులు ఎదుటివాళ్లకేనా అని మంత్రి, ఛైర్మన్‌, ఉన్నతాధికారులను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారట. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు నెల జీతాల కోసం అప్పులు ఇచ్చే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తరుణంలో కొత్త వాహనాల కొనుగోలు పక్కన పెడితే కొంతలో కొంతైనా ఆర్థికంగా తోడ్పాటు ఉంటుందని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

https://www.youtube.com/watch?v=UKN49C72U34
Exit mobile version