NTV Telugu Site icon

Off The Record: మాజీ పీసీసీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్

Ponnala

Ponnala

మాజీ పీసీసీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే మధ్య బుసలు కొడుతున్న పగలు | Ntv Off The Record

ఒకరు పీసీసీ మాజీ చీఫ్‌.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ ఒకే పార్టీ. కానీ.. ఒక్క క్షణం పడదు. నియోజకవర్గంలోనూ గట్టిగానే కుంపట్లు రాజేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతో వేడి పుట్టిస్తున్నారు నాయకులు. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

ఇద్దరి మధ్య పాత పగలు.. కొత్తగా బుసలు
జనగామ జిల్లా కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ రేసు మోదలైంది. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య జాగ్రత్త పడుతుంటే.. ఈ దఫా తనకే కాంగ్రెస్‌ టికెట్‌ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది రాజకీయం. ప్రత్యర్థి పార్టీల కంటే వీరి మధ్య గొడవలే రచ్చ లేపుతున్నాయి. జనగామలో చాలా కాలంగా ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా రాజకీయాలు చేశారు. ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పాత గొడవలు మర్చిపోలేకపోతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన కొమ్మూరి.. జనగామలో పొన్నాల గెలుపుకోసం పని చేశారు. దాంతో ఇద్దరూ కలిసిపోయారని అనుకున్నారు. ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోవడంతో.. ఈ సీటుపై ఆశలు పెంచుకున్నారు కొమ్మూరి. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ పాత పగలు.. కొత్తగా బుసలు కొట్టడం మొదలైంది.

రచ్చబండపై అప్పట్లో పరస్పరం ఫిర్యాదులు
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొన్నాల, కొమ్మూరి ఇద్దరూ జనగామలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు. దాంతో మళ్లీ జనగామ కాంగ్రెస్‌ రాజకీయాలు రంజుగా మారాయి. రాహుల్‌గాంధీ వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇద్దరూ వేర్వేరుగానే నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి పొన్నాల, కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయం నుంచి కొమ్మూరి రచ్చబండను ప్రారంభించారు. ఇదే క్రమంలో పరస్పరం పీసీసీకి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులు.. విభేదాలు ఎలా ఉన్నప్పటికీ.. జనగామ కాంగ్రెస్‌లో స్పష్టమైన చీలిక వచ్చేసింది. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత జనగామలో కాంగ్రెస్‌ కార్యక్రమాలకు పొన్నాల దూరంగా ఉంటున్నారనే విమర్శ ఉంది. హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని చెబుతారు. ఇదే సమయంలో కొమ్మూరి జనగామలో స్పీడ్‌ పెంచారు. ఇన్నాళ్లూ అధిష్ఠానం తనకు తప్ప మరెవరికీ జనగామ టికెట్‌ ఇవ్వదనే ఆలోచనలో ఉన్న పొన్నాల.. ఫీల్డ్‌లో కొమ్మూరి హడావిడి చూశాక మనసు మార్చుకున్నారట. తాను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు.

ఇద్దరి మధ్య వైరం పీక్స్‌కు వెళ్తోందా?
వచ్చే ఎన్నికల్లో టికెటే లక్ష్యంగా ఇద్దరూ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో జనగామ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో అని కేడర్‌ టెన్షన్‌ పడుతోందట. ఇప్పటికే డీసీసీ నియామకంపై రగడ నెలకొంది. ఇప్పుడు ఇద్దరు కీలక నేతల వైరం సమస్యను మరో లెవల్‌కు తీసుకెళ్తోందని అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లోనే జనగామ టికెట్‌ విషయంలో కొంత గందరగోళానికి దారితీసింది. పొత్తులో భాగంగా టీజేఎస్‌కు జనగామ సీటు ఇస్తారని చెప్పడంతో.. పొన్నాల తీవ్రంగా విభేదించారు. అనేక చర్చలు.. మంతనాలు.. మంత్రాంగాల తర్వాత పొన్నాలకే కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వడంతో పెద్దాయన ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కొమ్మూరి రూపంలో స్వపక్షంలోనే ప్రత్యర్థి ఎదురయ్యారు. మరి.. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.