అసంతృప్తి ఉన్నా బయట పెట్టలేదు. పార్టీకి లాయల్‌గానే ఉన్నారు. సైలెంట్‌గానే ఉండిపోయారు. కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మౌనంగా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఒక్కసారిగా మాదారి రహదారి అంటున్నారు ఆ ఇద్దరు మాజీలు. కొత్తఏడాది తొలిరోజే బలప్రదర్శనకు దిగారు. ఇంతకీ ఇది అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే యత్నమా? లేక ఇంకేదైనా ఆలోచన ఉందా? ఎవరా నాయకులు?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫీల్డ్ ఎంట్రీ
2023 ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తొలిరోజే ఉమ్మడి ఖమ్మం రాజకీయాలు వేడి పుట్టించాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తమ అనుచరులతో కలిసి బలప్రదర్శనకు దిగారు. వేర్వేరు ప్రాంతాల్లో ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టారు నాయకులు. వీరిలో తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయితే.. పొంగులేటికి పార్టీ అసలు టికెటే ఇవ్వలేదు. కానీ.. ఇద్దరూ గులాబీ కండువా వీడిచి పెట్టలేదు. అధికారపార్టీ పంచనే ఉంటూ.. పార్టీకి విధేయత ప్రకటిస్తూ నాలుగేళ్లు కాలం గడిపేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇక లాభం లేదని అనుకుని ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే వారు ఆశిస్తున్న సీట్లు ఖాళీగా లేకపోవడం.. హైకమాండ్ మూడ్ ఏంటో తెలియక పోవడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది.
పాలేరు నుంచి పోటీ చేస్తానంటున్న తుమ్మల..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దమనిషి. అధికారంలో ఉన్నా లేకపోయినా.. తుమ్మలకు ఏనాడు ప్రాధాన్యం తగ్గలేదు. గులాబీ పార్టీలో చేరిన సమయంలో అదే గౌరవం.. హోదా దక్కాయి. 2018లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల ఓడిపోయారు. గతంలో గెలుపోటములను చూసినా.. తను ఉన్న పార్టీలో ఆయనదే పెత్తనం. కానీ.. 2018 ఓటమితో సైలెంట్ అయ్యారు తుమ్మల. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోయినా… పల్లెత్తు మాట అనలేదు. పార్టీ మార్పుపై వచ్చిన ప్రచారాలను ఆయన తోసిపుచ్చారు. భద్రాచలం వరదల సమయంలో సీఎం కేసీఆర్.. ఎలాంటి హోదా లేని తుమ్మలను వెంట తీసుకెళ్లారు. దాంతో మౌనంగా ఉన్నప్పటికీ.. తుమ్మలకు అధికారపార్టీలో అదే గుర్తింపు ఉందని చర్చ సాగింది. అయితే ఆ మధ్య పార్టీ నేతల సమావేశంలో సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో.. పాలేరు సీటు ఆశిస్తున్న తుమ్మల విషయంలో ఏం జరుగుతుందా అని అంతా డైలమాలో పడ్డారు. తుమ్మల మాత్రం పాలేరు నుంచే పోటీ అని తరచూ ప్రకటన చేస్తూ చేస్తున్నారు.
అనుచరులూ పోటీ చేస్తారంటున్న పొంగులేటి
ఆ మధ్య వాజేడులో అనుచరులతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు భారీ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా పాలేరు నియోజకవర్గంలోని బారుగూడెం దగ్గర ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి భారీగా ఫాలోవర్స్ వచ్చారు. బల ప్రదర్శన ద్వారా అధిష్ఠానం మనసు మార్చే ప్రయత్నం చేశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేటిలోనూ టికెట్ ఇవ్వలేదు గులాబీపార్టీ. ఇప్పుడు తనకే కాదు.. తన అనుచరులకు కూడా సీట్లు కావలనే డిమాండ్ పెట్టారు తాజా కార్యక్రమంలో. ఈ ప్రోగ్రామ్‌కూ ఆత్మీయ సమ్మేళం పేరు పెట్టారు. సీట్లు ఇవ్వకపోతే పార్టీ మారిపోతానని మాజీ ఎంపీ చెప్పకపోయినా.. ఆయన మాటలకు అర్ధాలే వేరంటున్నారు జనాలు. తుమ్మల మాదిరే పొంగులేటి సైతం బలప్రదర్శన చేశారు.
తుమ్మల, పొంగులేటి కార్యక్రమాలపై అధిష్ఠానం ఫోకస్
ఉమ్మడి జిల్లాలో తుమ్మల, పొంగులేటి చేపట్టిన కార్యక్రమాలపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వీళ్ల కార్యక్రమాలకు వచ్చింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ఆరా తీసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికలు రాజకీయంగా కీలకం కావడంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నారు పార్టీ పెద్దలు. మరి.. ఇద్దరు కీలక నాయకులను పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడతారో లేక మాజీ లిద్దరూ తమదారి రహదారి అంటారో చూడాలి.