Site icon NTV Telugu

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఆ మాజీ మంత్రి దారెటు?

Atta Etta

Atta Etta

కేసీఆర్‌ ఆహ్వానంతో టీఆర్ఎస్‌లో చేరిక మండవ వెంకటేశ్వరరావు. మాజీ మంత్రి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మండవ.. నాటి యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. నాటి రాజకీయాల్లో మండవ పేరు ప్రముఖంగా వినిపించేది. జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆయన రాజకీయంగా సైలెంట్‌ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరారు మండవ. అప్పట్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ పిలవడం.. ఆయన చేరడం చకచకా జరిగిపోయాయి. కానీ.. మండవ పొలిటికల్‌ లైన్‌ మాత్రం ఆ సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిస్థాయిలో ఫలితాలు రాలేదు. ఆ ఎఫెక్టో ఏమో.. మండవను గులాబీ పార్టీలో పట్టించుకున్నవాళ్లూ లేరు. దాంతో ఆయన కూడా సైలెంట్‌ అయిపోయారు. ఎప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన సీనియర్ల భవిష్యత్‌పై చర్చ జరగినప్పుడల్లా మండవ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మాజీ మంత్రికి అధికార టీఆర్‌ఎస్‌ ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తుందని అనుకుంటున్నా.. అలాంటి కబురే లేకుండా పోయింది.

టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో మండవ వెంకటేశ్వరరావు పేరు చర్చల్లోకి వచ్చేది. రాజ్యసభకు మాజీ మంత్రి పేరు ఖరారైనట్టు అనేసుకున్నారు. ఒకానొక సమయంలో ఆయనే ఎమ్మెల్సీ అనుకున్నారు. కానీ.. ఏ సందర్భంలోనూ మండవ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రాజకీయ భవిష్యత్‌పై మండవ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆయన టీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా.. జంప్‌ చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అధికార పార్టీ భర్తీ చేయాల్సిన పదవులు పెద్దగా లేవు. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలను టీఆర్ఎస్ భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబుతో కనిపించారు మండవ. అప్పటి నుంచి కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో మాజీ మంత్రి ఉన్నారా? లేక టీఆర్ఎస్‌లోనే సరైన సమయంలో గుర్తింపు వస్తుందని వేచి చూస్తారో చూడాలి.

Watch Here : https://youtu.be/NgRYARko7TE

Exit mobile version