Site icon NTV Telugu

TRS : సొంత పార్టీ నేతలకే గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయా..? |

Tegala Krishna Reddy

Tegala Krishna Reddy

రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్‌లో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు రాజకీయాలు మారుతున్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య అంతర్గత పోరు మరోసారి బయట పడింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తీగల.. చెరువులు, పాఠశాల స్థలాలు కబ్జా చేస్తున్నారని.. వాటిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా మీర్‌పేటలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూనే.. అసలు సబితా తమ పార్టీలో గెలిచిన వ్యక్తి కాదని విమర్శల డోస్‌ పెంచేశారు. దీంతో జిల్లా టిఆర్ఎస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తీగల.. అకస్మాత్తుగా సంచలన వ్యాఖ్యలు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల బడంగ్‌పేట్‌ మేయర్ పారిజాతారెడ్డి మంత్రి సబితతో పొసగక కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు తీగల కూడా ఫైర్‌ అవడం చూస్తుంటే ఆయన కూడా కండువా మార్చేస్తారని గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారట.

2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున తీగల కృష్ణారెడ్డి , కాంగ్రెస్‌ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సబిత గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. సబిత చేరిక రుచించని తీగల టీఆర్ఎస్‌ కార్యక్రమాలకూ దూరమైన పరిస్థితి ఉంది. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం తీగల అనుచరులు రెబల్స్‌గా పోటీ చేశారు. దానిపై సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు కూడా. ఆ సమస్యపై తీగలను పార్టీ పెద్దలు ప్రశ్నిస్తే.. వారేవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చారట. ప్రస్తుతం మహేశ్వరం టీఆర్‌ఎస్‌లో రెండు బలమైన వర్గాలు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక వర్గానికి మంత్రి సబితా.. రెండో వర్గానికి తీగల నాయకత్వం వహిస్తున్నారు.

రంగారెడ్డి జడ్పీ పీఠంపై ఛైర్‌పర్సన్‌గా తీగల కోడలు అనిత ఉన్నప్పటికీ.. మహేశ్వరంలో సబిత, తీగల కలిసి పనిచేసే వాతావరణం లేదు. ఆధిపత్యం కోసం నిత్యం స్కెచులు వేస్తున్న పరిస్థితి ఉంది. మంత్రి పదవిలో ఉండటంతో సబిత శిబిరంలో కాస్త సందడి కనిపిస్తోంది. పనులు ఉన్నవారు ఆమె దగ్గరకే వెళ్తున్నారు. పలుమార్లు తీగల హెచ్చరించినా.. సబిత దగ్గరకు వెళ్లడం ఆపలేదట కొందరు నాయకులు. కలిసి పనిచేయకపోవడం వల్ల GHMC ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని చెబుతారు. తీగల అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆయనతో కలిసి మంతనాలు చేశారనే ప్రచారం గుప్పుమంది.

తాను టీఆర్ఎస్‌ను వీడేది లేదని తాజా ఎపిసోడ్‌లో తీగల కృష్ణారెడ్డి చెబుతున్నా..నమ్మశక్యంగా లేదంటున్నాయి పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉండగా.. తీగలకు మహేశ్వరం టికెట్ ఎలా ఇస్తారు అనేది పెద్ద ప్రశ్న. దానికి మాత్రం ఆయన జవాబు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యక్రమాలు పెరగడంతో.. ముందుగానే భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మరి.. ఆయన చూపు ఏ శిబిరంవైపు ఉందో కాలమే చెప్పాలి.

 

 

Exit mobile version