Site icon NTV Telugu

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి..!

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ట్రిపుల్‌రెడ్డి దారెటు? రెండు దఫాలుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎందుకు బరిలో దిగాలని అనుకుంటున్నారు? ఏ పార్టీనో స్పష్టత ఇవ్వకుండా గాలివాటాన్ని నమ్ముకున్నారా? ఇంతకీ ఎవరా ట్రిపుల్‌రెడ్డి?

2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్‌ ప్రకటన..!

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగి.. సడెన్‌గా పాలిటిక్స్‌ వద్దని అనుకుని 2014 ఎన్నికల్లో సైలెంట్‌ అయ్యారు మాజీమంత్రి దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. ఇంటి పేరును కలిపి ఇలా మొత్తంగా చెబితే పెద్దగా గుర్తుపట్టలేరు కానీ.. DL రవీంద్రారెడ్డి అంటే మాత్రం ఠక్కున అందరి నోళ్లలో నానుతారు ఈ మాజీ మంత్రి. పేరులో మూడు రెడ్డిలు ఉండటంతో సన్నిహితులు మాత్రం ఆయన్ని ట్రిపుల్‌రెడ్డి అని అంటుంటారు. రాజకీయంగా దాదాపుగా తెరమరుగైన రవీంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించి వైసీపీ, టీడీపీ శిబిరాల్లో వేడి పుట్టించారు. కడపతోపాటు…మైదుకూరు రాజకీయాల్లో చర్చగా మారారు DL.

కిరణ్‌కుమార్‌రెడ్డి సమయంలో కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌..!

1978లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన DL.. తర్వాత హస్తం గుర్తుపై మరో ఐదుసార్లు గెలిచారు. ఎవరితోనూ పెద్దగా అడ్జస్ట్‌ కారనే ముద్ర ఉంది. అదే ఆయనకు మైనస్‌ అంటారు సన్నిహితులు. డీఎల్‌ను వైఎస్‌ కేబినెట్‌లోకి తీసుకోకపోవడానికి అదే కారణంగా చెబుతారు మరికొందరు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ సీఎం కావాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆపై నల్లారి కేబినెట్‌లో చేరి.. కిరణ్‌కుమార్‌రెడ్డినే బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో DL తీరు పెద్ద సంచలనం. విదేశీ పర్యటనలో ఉండగానే అవమానకర రీతిలో మంత్రిపదవి నుంచి బర్తరఫ్‌ అయ్యారు రవీంద్రారెడ్డి.

వైసీపీలో అనుచరులకు ప్రాధాన్యం లేదని కుతకుత..!
సొంత మండలంలో ఆలయ ఛైర్మన్‌ పదవి అనుచరులకు ఇవ్వలేదట..!

2014లో టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మద్దతు తెలిపారు DL. తన అనుయాయులకు పుట్టా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల్లో మైదుకూరు నడిరోడ్డులో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. సుదీర్ఘకాలం శెట్టిపల్లి కుటుంబంతో వైరం సాగినా.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శెట్టిపెల్లి రఘురామిరెడ్డికి మద్దతు తెలిపారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కూడా తన అనుచరులకు గుర్తింపు లభించడం లేదని మాజీ మంత్రి కుతకుతలాడుతున్నట్టు సమాచారం. రవీంద్రారెడ్డి సొంత మండలం కాజీపేటలో నాగ నాదేశ్వరకోన ఆలయానికి పాటుపడుతున్న గంగవరం ఆదినారాయణరెడ్డి వంశీయులను ఎమ్మెల్యే పక్కన పెట్టారట. ఆలయానికి సంబంధంలేని వారిని ఛైర్మన్‌గా నియమించడంతో డీఎల్‌ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. తన అనుచరులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుని.. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని డీఎల్‌ మండిపడుతున్నారట. అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారని సమాచారం.

2024లో ఏ పార్టీ నుంచి బరిలో దిగేదీ స్పష్టత ఇవ్వలేదు..!

వైసీపీలో ఉంటూనే ప్రభుత్వ పాలనపై.. పాలకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కొనసాగే ఆలోచన ఉంటే.. ఈ స్థాయిలో కామెంట్స్‌ ఎందుకు చేశారన్నది ప్రశ్న. పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించేవాళ్లూ ఉన్నారు. అయితే 2024లో ఏ పార్టీ నుంచి బరిలో దిగేదీ స్పష్టత ఇవ్వలేదు. మైదుకూరులో వైసీపీ సీటు ఖాళీ లేదు. టీడీపీ నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఉన్నారు. మిగిలింది బీజేపీ, జనసేన. మరి ఈ రెండు పార్టీలలో ఒకదానిని ఎంచుకుంటారో లేక.. ఇండిపెండెంట్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన డీఎల్‌ మళ్లీ ఇండిపెండెంట్‌గానే బరిలో దిగుతారో తెలియదు. అప్పటికి ప్రజల మూడు ఎలా ఉంటే.. అలా గాలివాటంగా వెళ్లాలని అనుకుంటున్నట్టు ఆయన మాటలబట్టి తెలుస్తోంది. మరి.. ఆయన దారెటో ఏంటో.. రాజకీయంగా మళ్లీ సత్తా చాటుతారో లేదో కాలమే చెప్పాలి.

Exit mobile version