Site icon NTV Telugu

టీఎస్‌ఆర్టీసీలో ఛైర్మన్‌ బంగళాపై చర్చ..!

తెలంగాణ ఆర్టీసీలో ఆ బంగళా పేరు చెబితే హడలిపోతున్నారా? గతంలో ఎంతోమంది సకుటుంబ సపరివారంగా ఆ భవనంలో ఉన్నారు. ఇప్పుడా బంగళా మాకొద్దు అంటే మాకొద్దని ముఖం చాటేస్తున్నారట. ఆర్టీసీలో రాజుగారి గదిలా మారిన ఆ బంగళా ఏంటి? ఎక్కడుంది?

ఆర్టీసీ బంగ్లాపై రకరకాల చర్చలు..!

తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలు కార్పొరేషన్ చైర్మన్లకు, సలహాదారులకు ప్రభుత్వం క్వార్టర్స్‌ను కేటాయించింది. ఇటీవల కొన్ని కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లగా వచ్చిన వారికీ నివాస భవనాలు ఇచ్చారు. వారిలో కొందరికి తమకు కేటాయించిన బంగళాలు అస్సలు నచ్చడం లేదట. వాటిపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారట. ఆ జాబితాలోనే చేరింది TSRTCకి చెందిన బంగళా.

ఆ బంగ్లా వద్దన్న టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..!

సికింద్రాబాద్.. తార్నాక- మెట్టుగూడ మధ్యలో తెలంగాణ ఆర్టీసీకి ఎకరం స్థలంలో ఒక పెద్ద బంగళా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఛైర్మన్లు, పలువురు మంత్రులు గతంలో భవనంలోనే ఉండేవారు. అక్కడి నుంచే ఆర్టీసీ వ్యవహారాలు నడిపించేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పటైన తర్వాత కూడా ఆ ప్రభుత్వ కార్వర్ట్‌ వినియోగంలోనే ఉంది. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్న ఎం.సత్యనారాయణరావు ఆ బంగళాలోనే సుదీర్ఘ కాలం ఉన్నారు. తాజాగా అదే భవనాన్ని TSRTC ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌కు కేటాయించాలని భావించారు. ఇందుకోసం ఛైర్మన్ అనుమతి కోరగా ఆయన నిరాకరించినట్టు సమాచారం. తనకు ఆ బంగళా వద్దని.. మరో ప్రాంతంలో క్వార్టర్‌ కేటాయించాలని కోరారట.

ఐపీఎస్‌ క్వార్టరే కంఫర్ట్‌గా ఉందన్న సజ్జనార్‌..!

ఛైర్మన్‌ వద్దన్నారు కదా అని.. అదే భవనాన్ని ఆర్టీసీ ఎండీకి ఇస్తే బాగుంటుందని అధికారులు నిర్ణయించారట. ఆ విషయాన్ని ఎండీ సజ్జనార్‌ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన సైతం నో చెప్పారట. కుందన్‌బాగ్‌లోని ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో ప్రస్తుతం కంఫర్ట్‌గానే ఉంటున్నట్టు సజ్జనార్‌ బదులిచ్చారట. దీంతో మెట్టుగూడలోని ప్రభుత్వ బంగళాను ఛైర్మన్‌, ఎండీలు ఇద్దరూ వద్దని చెప్పడంతో ఆర్టీసీ అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదట.

వాస్తు బాగోలేదనే ప్రచారం ఎక్కువైందా?

ఈ బంగళా సువిశాలంగా.. విలసవంతంగా ఉంటుంది. నిర్వహణకే నెలకు 50 వేల వరకు ఆర్టీసీ ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. 24 గంటలపాటు భద్రత, తోటమాలి, కూలీలు పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఎవరూ ఉండకపోవడంతో రకరకాల ఊహాగానాలు.. చర్చలు షికారు చేస్తున్నాయి. గతంలో ఇదే భవనంలో కొందరు మంత్రులతోపాటు ఆర్టీసీ ఛైర్మన్లు గోనె ప్రకాశ్‌రావు, ఎం. సత్యనారాయణావు, సోమారపు సత్యనారాయణ ఉండేవాళ్లు. ఈ భవనం పక్క నుంచే మెట్రో రైలు వెళ్తోంది. సికింద్రాబాద్‌- ఉప్పల్‌ ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో రణగొన ధ్వనులు కామన్‌. పైగా ఇటీవల కాలంలో ఈ బంగళాకు వాస్తు బాగోలేదనే ప్రచారం ఎక్కువైంది. అది తెలిసే ఆర్టీసీ పెద్దలు ఈ క్వార్టర్‌లోకి రావడానికి జంకుతున్నారని సమాచారం. మరి.. రాజుగారి గదిలా మారిన ఈ ప్రభుత్వ నివాసం ఎవరికి ఆవాసం అవుతుందో చూడాలి.

Exit mobile version