NTV Telugu Site icon

TDP : సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ చూసి TDPకి రాజీనామా చేసారా ?

Divya

Divya

టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామా అంశంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆమె మూడు నాలుగేళ్ల క్రితమే పసుపు కండువా కప్పుకొన్నా.. దివ్యవాణికి ఉన్న సినీ గ్లామరుతో పార్టీలో.. ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఆమెకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీపైనా.. మంత్రులపైనా ఘాటైన విమర్శలు చేశారు దివ్యవాణి. అయితే మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు. కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్‌ చేశారు. మహానాడు జోష్ మీదున్న క్రమంలో దివ్యవాణి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్‌ చేశారామె. ఆ వెంటనే యూటర్న్‌ తీసుకున్నారు.

దివ్యవాణి వ్యవహారంలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. దివ్యవాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఓ ఫేక్ పోస్టింగ్ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయింది. ఆ పోస్టింగ్‌ చూసిన ఆమె ఆవేశంతో టీడీపీకి రాజీనామా చేశారు. అదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే దివ్యవాణిని సస్పెండ్‌ చేయలేదని టీడీపీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ బచ్చుల అర్జునుడు కూడా అదే స్పష్టం చేశారు. దివ్యవాణి సైతం అర్జునుడుతో మాట్లాడాక.. రాజీనామా చేసినట్టు పెట్టిన ట్వీట్‌ను ఆమె తొలిగించారు.

సోషల్‌ మీడియాలో ఈ తరహా పోస్టింగ్‌లు ఇప్పుడే కాదని.. గతంలో మాజీ మంత్రి అయ్యన్న విషయంలోనూ వచ్చాయని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు దివ్యవాణి వంతు వచ్చినట్టుగా విశ్లేషిస్తున్నారు. అయితే దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్‌కు తెరపడినప్పటికీ.. ఆమె లేవనెత్తిన అంశాలు.. మహానాడుకు రాకపోవడంపై టీడీపీలో చర్చ ఆగలేదు. పసుపు కండువా కప్పుకొన్నప్పటి నుంచి ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ.. ఇటీవల కాలంలో దివ్యవాణిని ఎందుకు పట్టించుకోవడం లేదనే టాక్‌ నడుస్తోంది. గతంలో ప్రతి అంశానికీ ఆమె రియాక్ట్‌ అయ్యేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో అవకాశాలు రావడం లేదనే వేదనలో దివ్యవాణి ఉన్నారట. ఇదే టైమ్‌లో మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆమెకు మరింత చిర్రెత్తికొచ్చినట్టు చెబుతున్నారు.

పార్టీకి చెందిన కొందరు మహిళా నేతలు.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన లేడీ లీడర్స్‌ కుట్ర చేస్తున్నారనే అనుమానాలు దివ్యవాణికి ఉన్నాయట. అయితే టీడీపీలో మరో వాదన ఉంది. గతంలో టీడీపీలో పనిచేసిన నటి కవిత కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కొందరి వాదన. గుడివాడలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న విషయాన్ని దివ్యవాణే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏదో చిన్నపాటి గ్యాప్ వల్ల ఆమె పొరపాటు పడి తొందరపాటులో మాట్లాడి ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం.

మహానాడులో మాట్లాడే విషయానికొస్తే.. పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలకే అవకాశం దక్కలేదు. అశోక్ గజపతి రాజు.. జేసీ బ్రదర్స్ వంటి నాయకులకు మైక్‌ ఇవ్వలేదు. గతానికి భిన్నంగా మహానాడు వేదిక పైనుంచి కొత్త వాయిస్ వినిపిద్దామని.. కొత్త ముఖాలను చూపిద్దామనే ప్రయత్నంలో చాలామంది సీనియర్లకు ఛాన్స్‌ దక్కలేదని చెబుతున్నారు. ఇది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయమే తప్ప.. ప్రత్యేకించి దివ్యవాణికి అవకాశం కల్పించకూడదనే భావన ఎంత మాత్రం లేదంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. మొత్తానికి దివ్యవాణి ఎపిసోడ్‌కు అలా ఎండ్‌ కార్డ్‌ పడింది.