Site icon NTV Telugu

గ్రూపుల కుప్పగా మారిన కుప్పం వైసీపీ..ఆసక్తిగా రాజకీయ చిత్రం

Kuppam

Kuppam

కుప్పంలో కలిసి సాగిన వైసీపీ నేతలు ట్రెండ్‌ మార్చేశారా?

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ ఆపరేషన్‌.. లోకల్‌ బాడీ ఎన్నికల్లో సక్సెస్‌ అయింది. ఒకప్పుడు కుప్పం అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే కుప్పం అనే చర్చను మూడేళ్లలో మార్చేశారు వైసీపీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదటి రెండు రౌండ్లలో మెజారిటీని తగ్గించి చంద్రబాబుకు షాక్‌ ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది అధికారపార్టీ. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు 19 చోట్ల వైసీపీ కౌన్సిలర్లు గెలిచారు. ఇలా వరస విజయాలతో ఊపు మీద ఉన్న కుప్పం వైసీపీ నేతలకు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో పదవులు కట్టబెట్టారు. కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌ భరత్‌ను ఎమ్మెల్సీని చేశారు. మరో నేత సెంథిల్‌ కుమార్‌ను రెస్కో ఛైర్మన్‌ను చేస్తే.. డాక్టర్‌ సుధీర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు. లోకల్‌ ఎన్నికల వేడి తగ్గిపోయింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కుప్పంలో ఎలాంటి పోరు లేదు. దీంతో ఇన్నాళ్లూ కలిసి ఉన్న వైసీపీ నాయకులు ట్రెండ్‌ మార్చేశారు. పార్టీని గాలికొదిలేశారన్నది కేడర్‌ విమర్శ. కొద్ది నెలలుగా కుప్పం వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రరూపు దాల్చాయని టాక్‌.

ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. ఆయన కుప్పంలో పార్టీని ఏకతాటిపై నడపలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది జిల్లాలో పార్టీని ఎలా నడిపిస్తారే ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కుప్పం గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ పార్థసారధి ఆత్మహత్య దుమారం రేపింది. సెల్ఫీ వీడియోలో వైసీపీ నేతలపై ఆయన తీవ్ర ఆరోపణలే చేశారు. ఇలా వైసీపీ నేతే.. సొంత నాయకులపై ఆరోపణలు చేస్తూ ప్రాణాలు తీసుకోవడం కలకలం రేగింది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్సీ భరత్‌ అంటీముట్టనట్టు ఉండటం శ్రేణులకు అర్థం కావడం లేదట.

భరత్ తీరువల్లే కుప్పంలో నేతలు, కేడర్ గ్రూపులుగా విడిపోయారనే వాదన ఉంది. ఆ మధ్య చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పంలో వైసీపీని ఒకేతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆరోగ్యం సహకరించక ఆయన ఇటు రావడం తగ్గించేశారు. దాంతో లోకల్‌ లీడర్స్‌ ఎవరికి వారుగా జూలు విదుల్చుతున్నట్టు సమాచారం. నాయకుల మధ్య జరుగుతున్న పంచాయితీని ఎంపీ మిధున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట స్థానిక కేడర్‌. త్వరలోనే ఆయన కుప్పం వైసీపీ నేతలతో భేటీ నిర్వహించి క్లాస్‌ తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే వైసీపీలో ఈ గ్రూపుల గోల చూశాక.. టీడీపీ శ్రేణులు కొంత రిలాక్స్‌ అయ్యాయట. వచ్చే ఎన్నికల వరకు వైసీపీలో విభేదాలు ఇలాగే కొనసాగితే తాము ఒడ్డున పడ్డట్టే అని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారట. మరి.. కుప్పంలో అధికారపార్టీని గాడిలో పెట్టేందుకు వైసీపీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Exit mobile version