NTV Telugu Site icon

TCongress : టీకాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారా..? l

Tcongres

Tcongres

తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరే డిఫరెంట్. ఎవరు ఏం చెప్పారు అనే దానికంటే.. మాకు నచ్చింది మేము చేస్తాం అనే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. వరంగల్ వేదికగా..రైతు డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. వచ్చే నెల రోజుల్లో క్షేత్ర స్థాయికి డిక్లరేషన్ తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. ఆ వెంటనే ప్రకటనలు చేసేసి.. సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ ప్రకటించారు పార్టీ నేతలు. ఆ షెడ్యూల్‌ ప్రారంభించి వారం అయ్యిందో, లేదో… నాయకులు అంతా గాయబ్ అయ్యారు. కింది స్థాయి నాయకులకు వదిలేశారా..? లేదంటే మొదలుపెట్టడం వరకే తమ పని అని అనుకున్నారో తెలియదు.

రైతు డిక్లరేషన్ పేరుతో రచ్చ బండ నిర్వహిస్తోంది కాంగ్రెస్. కానీ నాయకులు మాత్రం గల్లి గల్లీ తిరగడం వదిలేసి… అమెరికా ట్రిప్ పెట్టుకున్నారు. రచ్చ బండ షెడ్యూల్ ఇచ్చిన తరవాత… ఇంఛార్జి నియామకం.. నిధుల కేటాయింపు చేయకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.. దుబాయ్ ట్రిప్ వెళ్లి వచ్చారు. రచ్చ బండ ప్రారంభం అయినా… ఇప్పటికీ ఇంఛార్జిల జాబితా పూర్తి స్థాయిలో రాలేదు. దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మహేష్ గౌడ్ పని ఒత్తిడిలో పడిపోయారు. పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఇప్పటికే అమెరికా వెళ్ళారు. పార్టీ తీసుకున్న అజెండాను జనంలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఎక్కువగా ప్రచార కమిటీపైనే ఉంటుంది. కానీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అమెరికా పర్యటనలో ఉన్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. ఇంతలో రచ్చ బండ షెడ్యూల్ కూడా దగ్గర పడుతుంది.

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి… అమెరికా బాట పట్టారు. రోజుకో ఊరు తిరిగి .. డిక్లరేషన్ జనంలోకి తిసుకు వెళ్తా అని చెప్పిన రేవంత్ అమెరికా ఫ్లైట్ ఎక్కారు. జూన్ 6వ తేదీ వరకు ఆయన అమెరికాలో ఉంటారు. తెలంగాణలో గ్రామాలు తిరిగి రైతుల సమస్యలపై చర్చ పెడతాం అని చెప్పిన పీసీసీ చీఫ్‌.. అమెరికా వెళ్లడంతో నాయకులు కూడా లైట్ తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు కూడా కింది స్థాయి నేతలకు పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఎండలు అని… దావత్‌లంటూ రచ్చ బండపై అంతా కాన్సంట్రేషన్ చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. స్టార్ క్యాంపెయినర్.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అమెరికాలో నే ఉన్నారు. ఇలా పార్టీ లో కీలక పదవుల్లో ఉన్న నాయకులు అంతా విదేశీ పర్యటనల్లో ఉన్నారు.

రైతు డిక్లరేషన్ … రైతులకు చేరాలి.. చినుకు పడింది అంటే రైతులు అసలు గ్రామాల్లో దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో బిజీ అవుతుంటే… డిక్లరేషన్ వదిలేసి నేతలు అంతా అమెరికా టూర్ కి వెళ్ళారు. ఇక పార్టీ చింత న్ శిభిర్ కూడా జూన్ 1..2 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇది పార్టీకి కీలక సమావేశం. కానీ ఈ సమావేశాలకు కూడా కీలక నాయకులు ఉండటం లేదు. అమెరికా పర్యటన తప్పు కాదు కానీ… కీలక సమయంలో ముఖ్య నాయకులే పర్యటనలకు వెళ్తే..అసలు అజెండా పక్క దారి పడుతుంది అంటున్నారు గాంధీ భవన్ లో నేతలు.