Site icon NTV Telugu

అతి వినయంతో ఆ మంత్రి వివాదాల్లో పడ్డారా..? రచ్చ రచ్చ అవుతుందా ..?

Seen Sitara

Seen Sitara

కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి కుడుపూడి చిట్టాబ్బాయి వర్థంతి సభలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం వాడీవాడీగా ఉంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన కొందరికి రుచించలేదు. వైసీపీలోనే ఉన్న ఆ సామాజికవర్గం జాతీయ కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణ మంత్రి వేణు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అమలాపురంలోని శెట్టిబలిజలు కుడుపూడిని సమర్ధిస్తే.. రాజోలులోని అదే సామాజికవర్గం ప్రతినిధులు మంత్రి వేణుకు అండగా నిలిచారు. ఇంకొందరు ఈ వివాదంపై తటస్థంగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకపోతే మంత్రి వేణు, వైసీపీ నేత కుడుపూడి మధ్య తీవ్రస్థాయిలో రాజుకుంటున్న గొడవ వైసీపీని కలవరపెడుతోందట.

ఆ మధ్య బాదుడే బాదుడు కార్యక్రమానికి కాకినాడ వచ్చిన చంద్రబాబు.. మంత్రి వేణుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దీంతో మంత్రి వేణు వర్గీయులు రామచంద్రాపురంలో బాబును ఘోరావ్‌ చేశారు. టీడీపీ నేత రెడ్డి సుబ్రమణ్యం కౌంటర్‌ ఇవ్వడంతో సమస్య రాజకీయ రంగు పులుముకుంది. దీంతో శెట్టిబలిజ సామాజికవర్గం కోనసీమ జిల్లాలో మూడువర్గాలుగా విడిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతలో అమలాపురంలో జరిగిన వైసీపీ సర్వసభ్య సమావేశంలో మంత్రి వేణును సొంత సామాజికవర్గం ప్రతినిధులే అడ్డుకున్నారు. ఆ ఘటన రచ్చ రచ్చ అవుతోంది.

అమలాపురం ఘటన భద్రతా వైఫల్యంగా పోలీసు ఉన్నతాధికారులకు మంత్రి వేణు ఫిర్యాదు చేయడంతో.. ఆ సమయంలో విధుల్లో ఉన్న సీఐ బాజీలాల్‌పై చర్యలు తీసుకుని వీఆర్‌కు పంపారు. అయితే సీఐ బాజీలాల్‌ కాపు సామాజికవర్గానికి చెందిన అధికారి అని.. ఆ వర్గం భగ్గుమంది. కోనసీమలో పోలీసులను కాపాడాలని కొత్త నినాదం పుట్టుకురావడంతో మంత్రి విశ్వరూప్‌, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు చిక్కులు తెచ్చిపెట్టాయట. రగడ జరుగుతున్న సమయంలో సమస్యను సర్దుబాటు చేయడానికి విశ్వరూప్‌, బోసు చొరవ తీసుకోకపోవడంతో రాచపుండుగా మారిందని అభిప్రాయపడుతున్నారట. పైగా మంత్రి విశ్వరూప్‌ నియోజకవర్గంలో మంత్రి వేణు పెత్తనం ఏంటనే విమర్శలు ఊపందుకున్నాయి.

అమలాపురంలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారిపై కేసులు పెట్టడం.. సీఐ బాజీలాల్‌ను వీఆర్‌కు పంపడాన్ని మంత్రి విశ్వరూప్‌ వర్గం గుర్రుగా ఉందట. అమలాపురంలో మంత్రి వేణు పెత్తనం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట వైసీపీ శ్రేణులు. పైకి చెప్పకపోయినా ఈ సమస్య అటూ ఇటూ తిరిగి ఇద్దరు మంత్రుల మధ్య తెలియని అగాధం తీసుకొస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మంత్రి వేణుపై వచ్చిన విమర్శలు ఎటెటో మలుపులు తిరిగి.. దానికి ఎవరెవో బాధితులుగా తేలుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ వివాదం శ్రుతిమించకుండా పార్టీ పెద్దలు ఎలా ఫుల్‌స్టాప్‌ పెడతారో చూడాలి.

 

Exit mobile version