Kodela Sivaram : నిన్నటి వరకు ఆ నాయకుడు ఇంఛార్జ్ పదవి కోసం లాబీయింగ్ చేశారు. అధినేత మొదలుకొని పార్టీ నేతలు ఎవరూ కరుణించలేదు. తర్వాత చూద్దామన్నారే తప్ప భవిష్యత్‌పై భరోసా ఇవ్వలేదు. ఇంతలో రూటు మార్చి.. ప్లాన్ బీని బయటకు తీశారట ఆ నేత. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథా?
కోడెల శివరాం. దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవికోసం పార్టీలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కాకపోతే ఆయనది ఒంటరిపోరు. సత్తెనపల్లి టీడీపీ నేతలంతా ఒకవైపు.. ఆయన మరోవైపు అన్నట్టుగా ఉంది రాజకీయం. కోడెల కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు సైతం సత్తెనపల్లి ఇంఛార్జ్ పదవి ఇవ్వకపోవడంతో శివరాం నిరాశ చెందారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు తెరపైకి రావడంతో లోకల్ టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. చంద్రబాబు మాత్రం ఎవరినీ ఇంఛార్జ్‌గా ప్రకటించలేదు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలే కోడెల శివరామ్‌కు ప్రతికూలంగా మారాయని ప్రచారం జరిగింది. ఆ మచ్చ ఇంకా తొలగకపోవడంతో శివరామ్ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అయినా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆ మధ్య కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకు టీడీపీ నేతలను పిలిచారు. ఆ సభలోనే తన రాజకీయ జీవితానికి అంతా సాయం చేయాలని కోరారు శివరాం. అయితే కోడెల వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన వారెవరూ ఆయన కుమారుడికి సహకరించడం లేదట.
సత్తెనపల్లిలో పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు శివరాం ప్లాన్‌బీ అమలు చేస్తున్నట్టు సమాచారం. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా.. ఎదుర్కొంటానని శివరాం ప్రకటించారు. తనకు సహకరించవారందరికీ పరోక్షంగా చురకలు వేశారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశారు శివరాం. గెలిచినా.. ఓడినా.. కోడెల బిడ్డగా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. ఈ కామెంట్స్ సత్తెనపల్లి టీడీపీలో చర్చగా మారాయి. ఏ ధైర్యంతో శివరాం ఆ వ్యాఖ్యలు చేశారు? పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా ఇంఛార్జ్ పదవిని త్వరగా తేల్చాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోడెల కుటుంబానికి సన్నిహితంగా ఉండే కీలక నేత ద్వారా శివరాం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అందుకే బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన చాలా దీమాగా మాట్లాడినట్టు అభిప్రాయ పడుతున్నారు.
శివరాం వ్యాఖ్యలపై సత్తెనపల్లి టీడీపీలో కొందరు తప్పుపడుతున్నారు. ఒత్తిడి పాలిటిక్స్ వర్కవుట్ కావన్నది వారి వాదన. చంద్రబాబు దగ్గరకు ఆ విషయాన్ని తీసుకెళ్లారట. మరి.. సత్తెనపల్లి టికెట్ కోసం .. .ఇంఛార్జ్ పదవి దక్కేలా శివరాం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.
