Site icon NTV Telugu

పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలకు సీఎం వైఎస్ జగన్ ఝలక్ ఇచ్చాడా..?

పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్‌ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్‌ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్ స్ట్రోక్‌ ఇచ్చారా?

పీఆర్సీపై తిరుపతి పర్యటనలో సీఎం జగన్‌ కీలక ప్రకటన..!

తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ ప్రకటించారు JACగా ఏర్పడిన ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. సీఎం జగన్‌ ఎప్పుడు చర్చలకు పిలుస్తారు? ఎప్పుడు తమ డిమాండ్లపై చర్చిస్తారు అని ఎదురు చూస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 1న సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి ఉద్యమ షెడ్యూల్‌ కూడా ఇచ్చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ సమస్యకు ఎండ్‌కార్డు ఎలా అని ఆసక్తిగా చర్చించుకుంటున్న సమయంలో తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నేతలకు ఊహించని ఝలక్‌ ఇచ్చారు. ఆ ప్రకటనే ఇప్పుడు ఏపీ సచివాలయ.. ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది.

ప్రభుత్వం మెడల వంచేస్తామని ఉద్యోగ సంఘాల నేతల భారీ ప్రకటనలు..!

పీఆర్సీ నివేదిక బయట పెట్టాలి.. పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్ డీఏ చెల్లించాలి అనే డిమాండ్స్‌తో ప్రభుత్వంపై కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం మెడలు వంచేస్తాం.. మా డిమాండ్స్‌కు సర్కార్ దిగి రాక తప్పదు వంటి గంభీర ప్రకటనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ఇంతవరకు ఎక్కడా స్పందన లేదు. దీనికీ కారణం లేకపోలేదు. వేరే అజెండాను మనసులో ఉంచుకుని.. పీఆర్సీ నెపంతో కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అందుకే సీఎంవో నుంచి ప్రకటన లేదన్నది ఒక వాదన.

కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు ఝలక్‌..!

JACగా ఏర్పడిన ఉద్యోగ సంఘాల నేతలెవరూ సీఎంను కలిసే పరిస్థితి లేదు. కేవలం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాత్రమే ఎప్పుడంటే అప్పుడు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి వస్తున్నారనే టాక్‌ ఉంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను సీఎంను కలిసి మాట్లాడినట్టు.. డిసెంబర్‌ 10 వరకు పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారని మీడియాకు వెల్లడించారు వెంకట్రామిరెడ్డి. ఇది మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలకు కంటగింపుగా మారిందట. తాము బడా ఉద్యోగ సంఘాల నాయకులం అయినప్పటికీ సీఎం ఎందుకు తమను పిలవరు అనే ఫీలింగ్‌లో ఆ వర్గం ఉందట. ఇలా కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్‌ ఇచ్చారని చర్చ జరుగుతోంది.

పదిరోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుందన్న సీఎం జగన్‌..!

తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను కొంతమంది ఉద్యోగుల కుటుంబసభ్యులు కలిసి.. పీఆర్సీ గురించి విన్నవించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని.. పదిరోజుల్లో ప్రకటిస్తామని వారికి బదులిచ్చారు ముఖ్యమంత్రి. సాధారణంగా క్యాంప్‌ ఆఫీసులోనో.. సచివాలయంలోనో ఉద్యోగ సంఘాల నేతలతో గంటకొద్దీ సమావేశం నిర్వహించిన తర్వాత PRCపై ప్రకటన చేస్తుంటారు. అలాంటి ఫార్మాట్‌ ఏమీ లేకుండా.. తిరుపతి పర్యటనలో అదీ ఒక కాలనీలో పీఆర్సీ గురించి కీలక ప్రకటన చేసేశారు సీఎం జగన్‌. ఈ ప్రకటన క్రెడిట్‌ను అమరావతిలోని ఏ ఉద్యోగ సంఘం నాయకుడు తన ఖాతాలో వేసుకోకుండా ముఖ్యమంత్రి మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారని సచివాలయ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.

Exit mobile version