తెలంగాణ కాంగ్రెస్ .. ఏపీ కాంగ్రెస్‌కి అప్పు పడిందా..!? పాత బకాయిని వసూలు చేసుకునే పనిలో ఏపీ నేతలు ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీసీసీకి ఆ మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా అవసరమా? ఇంతకీ టీపీసీసీ చెల్లించాల్సిన అప్పు ఎంత?
టీపీసీసీ, ఏపీసీసీ మధ్య అప్పుపై కాంగ్రెస్‌లో చర్చ..!
తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల మధ్య ప్రస్తుతం అప్పు పంచాయితీ నడుస్తోంది. అదీ 2014 నుంచీ వసూలు కాకుండా ఉండిపోయిన అప్పుగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఏపీ, తెలంగాణల్లో రెండు పీసీసీలకు ప్రస్తుతం పరీక్షా కాలం నడుస్తోంది. తెలంగాణలో పుంజుకోవాలని చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జీరో నుంచి వర్క్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా అధికారానికి దూరమై ఏళ్లు గడిచిపోతున్నాయి. పార్టీ అకౌంట్‌లోని నిధులు ఖర్చైపోతున్నాయి. ఖాతా నుంచి తీయడమే తప్ప.. అకౌంట్‌లో డబ్బులు వేసి చాన్నాళ్ల అయింది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ సంగతే వేరు. డబ్బుకు లోటు ఉండదు. అందుకే ఏపీసీసీ, టీపీసీసీ మధ్య పాత అప్పు ఇప్పుడు చర్చకు వచ్చింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన ఏపీ కాంగ్రెస్ అడ్డా..!
తాజా ఎపిసోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్.. ఏపీ కాంగ్రెస్‌కు అప్పు పడింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు హైదరాబాద్‌లోని ఇందిరా భవన్ నుంచి జరిగేవి. ఏపీసీసీతోపాటు, ముఖ్య నాయకుల పర్యటనలు ఇక్కడ నుంచే. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఈ ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో ఏపీసీసీ తన అడ్డాను విజయవాడకు మార్చేసింది. ఇందిరా భవన్ తెలంగాణ కాంగ్రెస్ కింద ఉంది. ఒకే పార్టీ కావడంతో రెండు ప్రాంతాల నాయకుల మధ్య కాంగ్రెస్ ఆఫీస్ ఉపయోగించుకునే విషయంలో ఇబ్బందుల్లేవ్. కానీ.. ఆ అప్పు గురించే ఇప్పుడు చర్చ మొదలైంది.
పొన్నాల అడగడంతో రూ.15 లక్షలు ఇచ్చారట రఘువీరారెడ్డి..!
శైలజానాథ్ ఆరా తీయడంతో బయటపడ్డ రూ.15 లక్షల అప్పు
తెలంగాణ కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌గా పొన్నల లక్ష్మయ్య ఉన్నప్పుడు.. ఏపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉండేవారు. అప్పట్లో పొన్నాల కోరడంతో.. పార్టీ కార్యక్రమాల కోసం ఏపీసీసీ అకౌంట్ నుంచి 15 లక్షలు ఇచ్చారట రఘువీరారెడ్డి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో డబ్బు బదలాయింపు జరిగినా.. ఆనాడు ఈ మొత్తాన్ని అప్పుగానే భావించారట. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్‌లు మారిపోయారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి చెప్పక్కర్లేదు. ఆఫీస్ నిర్వహణ, చిన్నా చితకా కార్యక్రమాలు చేయాలన్నా జేబులో నుంచి డబ్బులు తీయడానికి పార్టీ నేతలు ముందుకు రావడంలేదు. దీంతో పార్టీ అకౌంట్‌పై ఆధారపడుతున్నారు. పార్టీకి వచ్చే చందాలు తగ్గిపోయాయి. దీంతో పార్టీ దగ్గర ఉన్న వనరులేంటి? అని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆరా తీయగా 15 లక్షల అప్పు తెలిసిందట.
రూ.15 లక్షల కోసం రేవంత్ దగ్గరకు శైలజానాథ్ రాయబారం..!
తెలంగాణ కాంగ్రెస్‌కు ఇచ్చిన ఆ 15 లక్షలు ఇప్పుడు APCC దగ్గర ఉంటే కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలను నడిపించేయొచ్చనే ఆలోచన శైలజానాథ్ అండ్ కో దగ్గర ఉందట. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో రాయబారం పంపే పనిలో పడ్డారు శైలజానాథ్. ఇన్నాళ్లూ పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో రేవంత్‌రెడ్డి అందుబాటులోకి రాలేదట. ఇప్పుడు పార్టీలోని సన్నిహితుల ద్వారా రేవంత్ చెవిన ఆ 15 లక్షల బకాయి మాట వేయడానికి ప్రయత్నిస్తున్నారట.
రేవంత్ దగ్గరకు శైలజానాథ్ రాయబారం చేరిందా?
తెలంగాణ కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే. కాకపోతే ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీలు.. ఆర్థికంగా బలమైన నాయకులు ఉన్నారు. అందువల్ల పార్టీ కార్యక్రమాలకు నిధుల కొరత లేదు. మరి శైలజానాథ్ అప్పు వసూలు రాయబారం రేవంత్ వరకు చేరిందో లేదో కానీ.. కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలో ఇప్పుడు 15 లక్షలే అపురూపం అయ్యాయి. మరి.. 15 లక్షల అప్పు సంగతి పాత పీసీసీ చీఫ్‌ల దగ్గర తేల్చుకోవాలని చెబుతారో.. లేక బకాయిలు తీర్చి ఏపీసీసీని రేవంత్ ఆదుకుంటారో చూడాలి.
