గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో అదొకటి. రెండు పర్యాయాలుగా గెలుస్తోంది ఆయనే. కానీ పార్టీలో.. నియోజకవర్గంలో పెత్తనం ఇంకొకరది. ఏ చిన్న పని కావాలన్నా.. ఎమ్మెల్యే కంటే.. ఆ నాయకుడి దగ్గరకే వెళ్లాలి. అక్కడ ఆ నాయకుడిదే పెద్దన్న పాత్ర. అదెక్కడో.. ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం.
కొండేపి టీడీపీలో షాడో ఎమ్మెల్యే?
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం. వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి డోలా బాలవీరాంజనేయస్వామి గెలుస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ రాజకీయాలు దామచర్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయి. నియోజకవర్గ రాజకీయాలను శాసించేది వారే. 2004 వరకూ జనరల్ కేటగిరీలో ఉన్న ఈ నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. అప్పటి నుంచి టీడీపీ తరఫును బాలవీరాంజనేయస్వామి బరిలో ఉంటున్నారు. 2009లో ఆయన ఓడినా.. 2014, 2019లో గెలిచారు. పేరుకు ఎమ్మెల్యే అయినా.. షాడో మాత్రం టీడీపీ నేత దామచర్ల సత్యగా చెబుతారు.
సత్య పెద్దన్న పాత్ర.. ఎమ్మెల్యే స్వామి సైలెంట్
గతంలో టీటీడీ సభ్యుడిగా ఉన్నా.. రాష్ట్రంలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నా.. బాలవీరాంజనేయస్వామి మాత్రం కొండెపిలో సైలెంట్. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో సత్య మాటను కాదనలేని పరిస్థితి ఎమ్మెల్యేది. పార్టీ పదవుల పంపకం.. పార్టీ కార్యక్రమాలు ఏం జరగాలన్నా దామచర్ల సత్య కనుసన్నల్లో చేపట్టాల్సిందే. సత్యకు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోస్ట్ ఉంది. ఆ హోదాలో చక్రం తిప్పుతుంటారు. ఇటీవల పొన్నలూరు మండలం సంగమేశ్వర దేవాలయం వద్ద టీడీపీ చేపట్టిన వనభోజనాల కార్యక్రమ నిర్వహణ మొత్తం సత్యనే చూసుకున్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలని పాదయాత్ర చేస్తామని.. సత్య ప్రకటిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆ కార్యక్రమాన్ని కార్తీక ఆత్మీయ సమ్మేళనంగా మార్చివేసి టీడీపీ రాష్ట్ర నేతలను ఆహ్వానించారు.
స్వామి భక్తి చాటుకుంటోన్న ఎమ్మెల్యే
దామచర్ల సత్య పెద్దన్న పాత్రపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎమ్మెల్యే స్వామి మాత్రం వారిపట్ల స్వామిభక్తి చాటుకుంటారు. ఎప్పటికప్పుడు ఏదో నియోజకవర్గం నుంచి సత్య పోటీ చేస్తారని అనుచరులు భావించినా.. ఆయన అంగీకరించడం లేదు. కొండేపిని వదిలి మరో చోటుకు వెళ్తే.. స్థానికంగా పట్టుకోల్పోతామనే ఆలోచన వారిలో ఉందట. పార్టీ అధిష్ఠానం మాత్రం సత్యను మరో నియోజకవర్గంలో పోటీ చేయించేందుకు చూస్తోందట. అయితే ప్రస్తుతం ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గంగా ఉన్న కొండేపి.. తిరిగి జనరల్ కేటగిరిలోకి వచ్చాక పోటీ చేయాలని వేచి చూస్తున్నారట సత్య. అందుకే మరో చోటుకు వెళ్లి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ టీడీపీ అధిష్ఠానం ఒత్తిడి చేస్తే మనసు మార్చుకుంటారా? లేక కొండేపిలో పెద్దన్న పాత్రకే పరిమితం అవుతారో చూడాలి.
