NTV Telugu Site icon

YCP : కొండేపి వైసీపీలో ఇంఛార్జ్ మార్పుపై రచ్చ రచ్చ

Konda

Konda

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోతోంది. వైసీపీలోని రెండు గ్రూపులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌గా ఎవరు ఉన్నా ఓవర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోది. రెండో పక్షం వైరిపక్షంగా మారిపోతోంది. దీంతో కొండేపి వ్యవహారాలు తరచూ వైసీపీ పెద్దలకు తలనొప్పులుగా తయారైంది. ఇప్పుడు ఇంఛార్జ్‌ మార్పు విషయంలోనూ అదే జరిగింది.

మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్‌గా మాదాసి వెంకయ్య ఉన్నారు. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. అప్పటి వరకూ అక్కడ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబు కలసి పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓడినా వెంకయ్యను డీసీసీబీ ఛైర్మన్‌ను చేసింది పార్టీ. దీంతో ఓడినా ఆయనే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే ఇంఛార్జ్‌ పదవి పోయినప్పటికీ టంగుటూరులోనే మకాం ఏర్పాటు చేసుకుని వెంకయ్య శిబిరానికి అశోక్‌బాబు అండ్‌ టీమ్‌ కంట్లో నలుసులా మారిందంటారు.

మూడేళ్లుగా ఇదే వర్గపోరు కొండేపి వైసీపీలో కామన్‌ అయిపోయింది. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కష్టమని భావించారో ఏమో ఇంఛార్జ్‌గా ఉన్న వెంకయ్యను తప్పించి.. అశోక్‌బాబుకు మళ్లీ పట్టం కట్టారు. వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేనికి అనుచరుడిగా అశోక్‌బాబుపై ముద్ర ఉంది. దాంతో పదవి రాగానే నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ఏ ప్రోగ్రామ్‌ చేసినా సొంత టీమ్‌ వచ్చింది తప్పితే వెంకయ్య అనుచరులు కనిపించలేదు. వైసీపీ పెద్దల నిర్ణయంతో మనస్తాపం చెందిన వెంకయ్య సైతం సైలెంట్‌ అయ్యారు.

ఇన్నాళ్లూ కొండేపిలో తనను ఇబ్బంది పెట్టిన అశోక్‌బాబుకే ఇంఛార్జ్‌ పదవి ఇవ్వడంతో వెంకయ్య అండ్ కో అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. వెంకయ్య అనుచరులుగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పెద్ద సంఖ్యలో బాలినేని, సజ్జల దగ్గరకు వెళ్లి తమ అసంతృప్తిని తెలియజేశారట. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ఎలా ఇంఛార్జ్‌ చేస్తారని నిలదీసినట్టు సమాచారం. ఇప్పుడు ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్‌బాబులో ఎలాంటి మార్పు రాలేదని ఫిర్యాదు చేశారట. ఇందుకు కొన్ని సంఘటనలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి వెంకయ్యనే ఇంఛార్జ్‌గా చేయ్యాలని డిమాండ్ చేశారట.

అసమ్మతి నేతల ఫిర్యాదులు వర్కవుట్ అయ్యాయో ఏమో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తాము చెప్పాకే చేపట్టాలని ఇంఛార్జ్‌ అశోక్‌బాబుకు పార్టీ పెద్దల నుంచి సమాచారం వెళ్లిందట. దీంతో అప్పటికప్పుడు ప్రొగ్రామ్‌ ఆపేసిన ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారట. కేవలం మౌఖిక ఆదేశాలతోనే అశోక్‌బాబును ఇంఛార్జ్‌గా పెట్టారని.. తిరిగి వెంకయ్యే వస్తారని ప్రస్తుతం ప్రచారం ఊపందుకుంది. దీంతో కొండేపి విషయంలో వైసీపీ ఆలోచన ఏంటో.. ఎవరిని బుజ్జగిస్తారో.. ఎవరిని పక్కన పెడతారో అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.