Site icon NTV Telugu

బలం లేకపోయినా గెలిచిన కాంగ్రెస్ కి ఇప్పుడు ఏమైంది …?

గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు బలగం ఉంది. అలాంటిది బరిలో ఉండకుండా కాడి పడేశారు. రాజకీయంగా ఎత్తులు.. జిత్తులు వేయగలిగిన వాళ్లు ఎందుకు సైలెంట్‌ అయ్యారు? పార్టీ నేతలపైనే సొంతవాళ్లు ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకొచ్చింది?

వ్యూహం లేదు.. కాడి పడేశారు..!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారం డీసీసీలకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. బలం లేకున్నా బరిలో నిలుచుని.. సమస్యలపై చర్చకు పెట్టాలని మెదక్, ఖమ్మం జిల్లాలో పోటీ చేసింది. నల్గొండ జిల్లాల్లో అసలు ఆ ఆలోచనే చేయలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓటర్లుగా కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 340 మంది వరకు ఉన్నారు. 230 ఓట్లున్న మెదక్‌లో అభ్యర్థిని బరిలో దించి.. నల్లగొండలో కీలక నాయకులు ఉన్నా కిమ్మనలేదు. వ్యూహం లేదా..? కాడి పడేశారా..? ఉద్ధండులైన నాయకులకు ఏమైంది అన్నది పార్టీలో చర్చ.

గతంలో బలం లేకపోయినా కాంగ్రెస్‌ గెలిచింది..!

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారు. వీళ్లంతా కాంగ్రెస్‌ రాజకీయాల్లో తలపండినవాళ్లే. ముగ్గురూ ఐక్యంగా కదిలినా.. ఎవరో ఒకరు వ్యూహ రచన చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్‌ మరోలా ఉండేది. పార్టీకి మూడొందల మంది ఓటర్లు ఉన్నచోట ఎందుకు పట్టించుకోలేదన్నది కాంగ్రెస్‌ శ్రేణులకు అర్థం కాలేదట. గతంలో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్‌కు గెలిచేంత బలం లేదు. కానీ.. కాంగ్రెస్‌ పార్టీ నేతల మ్యాజిక్‌ పనిచేసింది.. రాజగోపాల్‌రెడ్డి గట్టెక్కారు. వంద ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి.. అదే జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులకు ఇప్పుడేమైందన్నదే ప్రశ్న.

వెంకటరెడ్డి ఆశీసులతో లక్ష్మయ్య నామినేషన్‌..!
కాంగ్రెస్‌ మద్దతు ఆశించిన మాజీ ఎమ్మెల్యే నగేష్‌..!

ముగ్గురు సీనియర్ల మధ్య సమన్వయం లేదన్నది అందరూ చెప్పేమాట. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీసులతో నల్లగొండ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య నామినేషన్‌ వేశారు. లక్ష్మయ్యకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేయలేకపోయింది. వెంకటరెడ్డి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు కనిపించలేదు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నగేష్‌ సైతం కాంగ్రెస్‌పార్టీ మద్దతు తనకే అని చెప్పుకొన్నారు. ఆయన విషయంలోనూ కాంగ్రెస్‌ నుంచి ప్రకటన లేదు. చివరకు పోటీచేసిన నగేష్‌, లక్ష్మయ్యలు ఎవరికీ కాకుండా అయిపోయారు. దీంతో ఇక్కడ బరిలో ఉన్న అధికారపార్టీకి ఎలక్షన్‌ మరింత ఈజీ అయిందని టాక్‌. ఎన్నిక జరిగిన ఇతర జిల్లాల్లో తమ పార్టీ ఓటర్లను TRS క్యాంపులకు తరలిస్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను ఎక్కడికి తీసుకెళ్లలేదు. ఇక కాంగ్రెస్‌ ఓటర్లకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేయలేదు.

పోలింగ్‌ రోజున మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్‌ ఓటర్లకు టీఆర్ఎస్‌ గాలం..?

పోలింగ్‌ రోజున మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌ ఓటర్లు సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ విషయం ఆఖరి నిమిషంలో పసిగట్టిన అధికార టీఆర్ఎస్‌ వెంటనే వ్యూహం మార్చింది. కాంగ్రెస్‌ ఓటర్లకు గట్టిగానే గాలం వేసిందని టాక్‌. దాంతో మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోలింగ్‌ బూత్‌లవైపు కదిలారు. రెండు పార్టీలలోనూ వచ్చిన కాడికి సర్దుకుని సంతృప్తి చెందినట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. మా బంగారం మంచిదైతే ఇంకా బాగా గిట్టుబాటు అయ్యేదని వాపోయిన వాళ్లూ ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ సీనియర్లు ఉన్న జిల్లాల్లో పోటీకి అభ్యర్థే లేకుండా పోయారు.

Exit mobile version