తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తాడోపేడో తేల్చుకోబోతున్నారా? వారి వ్యూహం ఏంటి? పీసీసీ చీఫ్ లక్ష్యంగా మొదలైన తిరుగుబాటు ఎటు దారితీస్తుంది? అధిష్ఠానం మౌనంగా ఉందా .. లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?
ఒకరిద్దరు సీనియర్లతో టచ్‌లోకి హైకమాండ్
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న పంచాయితీలు బహిర్గతం అయ్యాయి. సీనియర్లు ఓ జట్టుగా ఏర్పడ్డారు. బాహటంగానే రేవంత్‌కి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైతం మీడియా ముందు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే ప్రశ్న. ఇలాంటి అంశాల చుట్టూనే కాంగ్రెస్ రాజకీయం తిరుగుతోంది. సీనియర్ నాయకులంతా మరోసారి భేటీ కాబోతున్నారు. ఇదే సమయంలో ఒకరిద్దరు సీనియర్ నేతలతో AICC టచ్‌లోకి వెళ్లింది. త్వరలోనే ఢిల్లీకి పిలిచి మాట్లాడుతుందని సమాచారం. అయితే సీనియర్లు తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నారట. అంతా ఏకతాటి మీదకు వచ్చి హైకమాండ్ ఎదుట తమ వాయిస్ వినిపించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
భట్టి నివాసంలో సీనియర్లు మరోసారి భేటీ
సీనియర్ల ఎత్తుగడను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది రేవంత్ వర్గం. టిడిపి నుంచి వచ్చిన 50 మందికి పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు చేయడంతో.. ఆ జాబితాలోని 12 మంది తమ పదవులకు రాజీనామా చేసి.. రివర్స్ అటాక్ చేశారు. దాంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. రేవంత్ అనుకూల వ్యతిరేక వర్గాలు హోరాహోరీగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే తమ బలాన్ని పదర్శించే పనిలో ఉన్నారు అసంతృప్త నాయకులు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో జరిగే తదుపరి సమావేశానికి ఎక్కువ మందిని పిలిచే పనిలో పడ్డారట.
వెనక్కి తగ్గే యోచనలో లేని సీనియర్లు
ఈ గొడవలపై AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఫోకస్ పెట్టారు. AICC కార్యదర్శి నదీంజావెద్‌కు ఫోన్ చేసి మాట్లాడారట. సీనియర్ నేతలను సంప్రదించి.. వారి అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారట ఠాగూర్. సీనియర్లతో జావెద్ మాట్లాడేందుకు ప్రయత్నించినా.. అటు నుంచి పెద్దగా స్పందన లేదట. ఒకరిద్దరే టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. పనిలోపనిగా రేవంత్ వర్గంలోనూ చర్చించారట జావెద్. ఆ చర్చలు.. మంత్రాంగాలు ఎలా ఉన్నప్పటికీ.. సీనియర్లు మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.
ఒకరిద్దరితో మాట్లాడిన ప్రియాంకాగాంధీ
సమస్య పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లోకి ప్రియాంకాగాంధీ సైతం ఎంట్రీ ఇచ్చారట. ఒకరిద్దరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ప్రియాంకాగాంధీ మాట్లాడినట్టు చెబుతున్నారు. త్వరలోనే అందరినీ ఢిల్లీకి పిలిచి వ్యవహారాన్ని సెట్ చేసే యోచనలో ఆమె ఉన్నట్టు సమాచారం. హస్తినలో హైకమాండ్ ఏం చేస్తుందో ఏమో కానీ.. అసంతృప్త నాయకులు మాత్రం పీసీసీ నాయకత్వాన్ని మార్చాలని పట్టుబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వచ్చే నెల 26 నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. ఈలోపుగానే సమస్య పరిష్కరించే దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే పనిలో సీనియర్లు ఉన్నారట. అందుకే హైకమాండ్ ఏం చేస్తుంది? సీనియర్లు తెగేదాకా లాగుతారా? బుజ్జగింపులు వర్కవుట్ అవుతాయా? అని గాంధీభవన్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
